26 May, 2026 | 2:16 AM

కేసీఆర్‌కు కరెంట్ భయం!

17-06-2024 12:10 AM

విచారణాధికారిని వైదొలగమనడానికి నువ్వెవరు?

ఉల్టాచోర్ కొత్వాల్‌కో డాంటే తరహా మాజీ సీఎం తీరు

కేసీఆర్ లేఖపై మండిపడ్డ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి

జగిత్యాల, జూన్ 16 (విజయక్రాంతి): విద్యుత్తు ఒప్పందాలపై నియమించిన నరసింహారెడ్డి నివేదికతో మాజీ సీఎం కేసీ ఆర్‌కు భయం పట్టుకున్నదని, అందుకే విచారణ నుంచి ఆయనను తప్పుకోవాలని మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విచారణ అధికారిని తప్పుకోమని చెప్పడానికి కేసీఆర్ ఎవరు? అని ప్రశ్నించారు. ఆదివారం జగిత్యాల ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ తీరు ఉల్టాచోర్ కొత్వాల్‌కు డాంటేలా ఉన్నదని ఎద్దేవాచేశారు.

విచారణకు సహకరించకపోవడం నేరాన్ని అంగీకరించినట్టేనని పేర్కొన్నారు. బొగ్గు ఉన్న రామగుండంలో కాదని నల్లగొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి పవర్‌ప్లాంట్ నిర్మించాలన్న కేసీఆర్ నిర్ణయంతో ప్రజలపై రూ.౪౦ వేల కోట్ల భారం పడిందని ఆరోపించారు. కేసీఆర్ చేసిన తప్పులకు చైనాలో ఉరి తీసేవారని మండిపడ్డారు. తాను ఓడిపోయిన అనంతరం కేసీఆర్‌కు వ్యవస్థ మీద గౌరవం పోయిందని అన్నారు. ఈ సమావేశంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి, నాయకులు బండ శంకర్, గుంటి జగదీశర్  పాల్గొన్నారు.