17 May, 2026 | 11:04 PM

విద్యారంగంలో సమూల మార్పులు

20-06-2024 01:04 AM
  • సరికొత్త సంస్కరణలు అమలు చేస్తాం

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం

ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

మంథని, జూన్ 19 (విజయక్రాంతి): విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన బడిబాట ముగింపు సభలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నద న్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వ విద్యాలయం వరకు అన్ని విద్యాసంస్థల్లో  సంస్కర ణలు అమలు చేస్తామని చెప్పారు. పాఠశాలల్లో బోధనపై కలెక్టర్ తరచూ సమీక్షిం చాలని సూచించారు. విద్యార్థుల తల్లులకే పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఇందు లో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల నుంచి 984 మంది విద్యార్థులను సర్కార్ బడుల్లో చేర్పించడంపై ప్రశంసించారు. జిల్లావ్యాప్తంగా రూ.30 కోట్లతో 478 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టి, 99 శాతం పనులు పూర్తి చేశామన్నారు. స్పోర్ట్స్ యూనిఫాంతో విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యేలా శ్రద్ధ తీసుకుంటున్న టీచర్లను మంత్రి అభినందించారు. త్వరలో మెగా డీఎస్సీ వేసి ఖాళీ స్థానాలను భర్తీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగాలకు ఉపాధి కల్పించేందుకు ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా కోకాకోలా కంపెనీతో చర్చించినట్టు మంత్రి గుర్తుచేశారు. నియోజకవర్గంలో అనువైన ప్రాంతాల కోసం కంపెనీ ప్రతినిధులు పరిశీలన చేస్తున్నారని చెప్పారు.

రూ.౨౩౪ కోట్లతో టాటా కంపెనీ సౌజన్యంతో అడ్వాన్స్ లెర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. మంథనిలో ఒక చిన్న ఐటీ సంస్థ త్వరలో ౫౦ మందికి ఉపా ధి కల్పిస్తుందని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా శివ్వారం నుంచి మంథని వరకు గోదావరిపై బ్రిడ్జికి రూ.౧౪౫ కోట్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, ఆర్డీవో హనుమానాయక్, ఎంపీపీ శంకర్, జడ్పీటీసీ సుమలత, మున్సిపల్ చైర్‌పర్సన్ రమాసురేష్‌రెడ్డి  పాల్గొన్నారు.

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని, మంచి ఆదాయాన్ని గడిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించి మాట్లాడారు.  

పారదర్శక పాలన అందించాలి..

మున్సిపల్ పాలకవర్గం, అధికారులు పట్టణవాసులకు మెరుగైన పాలన అందించాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. మంథని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కలెక్టర్ మున్సిపల్ వర్గాలకు స్టడీ టూర్స్ ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలోని డంపింగ్ యార్డును మరోచోటికి మార్చేందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలన్నారు. అనంతరం మంత్రి మున్సిపల్ చార్టెడ్ ఖర్చుల వివరాలు, టీయూఎఫ్ డీసీ నిధుల వినియోగంపై చర్చించారు. సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మున్పిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమా సురేష్‌రెడ్డి, ఆర్డీవో హనుమానాయక్, కమిషనర్ మల్లికార్జున్ పాల్గొన్నారు.