మా ప్రాంతానికి రావొద్దు
విదేశీ విద్యార్థులకు కెనడా అడ్డుకట్ట
ఉద్యోగాలన్నీ లాక్కెళ్తున్నారని ఆరోపణ
న్యూఢిల్లీ, మే 25: ప్రపంచంలో అత్యధిక దేశాల్లో భారతీయులున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముఖగా సేవలందిస్తున్నారు. కెనడాను అయితే మనీ భారత్ అని కూడా పిలుస్తారు. ఆ దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నది కూడా భారతీయులే నిర్ణయిస్తారంటే వారి ప్రభావం ఏ మేరకు ఉన్నదో అర్థంచేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో అన్నిదేశాలు వలసలను అడ్డుకొనేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. తాజాగా కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ (ఈపీఐ) అయితే విదేశీయులు తమ ప్రాంతానికి రావొద్దని బహిరంగంగానే ప్రకటించింది. అంతేకాదు.. విదేశీ విద్యార్థులు, ఉద్యోగులకు ఇచ్చే నివాస అనుమతి రూల్స్‌లో భారీ మార్పులు చేసింది. సహజంగానే ఇక్కడ భారతీయ విద్యార్థులు అధికంగా ఉంటారు. అంటే ఒకరకంగా భారతీయులు తమ ప్రావిన్స్‌కు రావొద్దు అని ప్రకటించింది.
మా ఉద్యోగాలు తన్నుకుపోతున్నారు
కెనడాలో భారతీయులు లక్షల మంది ఉన్నారు. వీరిలో సిక్కులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఏటా వేలమంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్తున్నారు. చదువు అయిపోయిన తర్వాత అక్కడే ఉద్యోగాలు వెతుక్కొని సెటిలైపోతున్నారు. చదువు మధ్యలో కూడా తాత్కాలిక ఉద్యోగాలు చేసుకొంటున్నారు. దీంతో తమకు ఉద్యోగాలు దొరకటం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే కెనడా ప్రభుత్వం వారంలో విద్యార్థులు ఉద్యోగం చేసుకొనే పనిగంటలను తగ్గించింది. మరోవైపు చదువు నెపంతో వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఉంటున్నారని, వారందరికీ ఇండ్లు, వైద్యం, విద్య అందించటం ప్రభుత్వాలకు తలకుమించిన భారం అవుతున్నదని స్థానిక ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. కెనడా కార్మిక శాఖ లెక్కల ప్రకారం 2024 మొదటి నాలుగు నెలల్లో ఆ దేశంలో వర్క్ ఫోర్స్ (పనిచేయగల వయసు జనాభా) 4,11,400 మంది ఉన్నారు.
2023లో ఇదే కాలంతో పోల్చితే వర్క్‌ఫోర్స్ ఇది 47 శాతం ఎక్కువ. కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికం. 2023 నవంబర్ నాటికి కెనడాలో భారతీయ విద్యార్థులు 5,79,075 మంది ఉన్నారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో ఇది 37 శాతం. 2022లో ఇది 41 శాతంగా ఉండేది. ఉద్యోగాల కోసం కెనడాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య 2013 మధ్య దశాబ్ద కాలంలో ఏకంగా 326 శాతం పెరిగింది. 2013లో 32,828 మంది భారతీయులు కెనడాకు వెళ్లగా, 2023లో 1,32,715 మంది వెళ్లారు. దీంతో స్థానికులు తీవ్ర అభద్రతాభావంలోకి వెళ్లిపోతున్నారు. పీఈఐ నిర్ణయంపై భారతీయ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కఠిన నిబంధనలను వెనక్కు తీసుకోవాలని ర్యాలీలు కూడా చేస్తున్నారు.






