30 July, 2026 | 1:08 AM

రాహుల్ ‘పొలిటికల్ ఇడియట్’

30-07-2026 12:00 AM

దేశ విద్యార్థి లోకాన్ని ‘ఇడియట్స్’ అన్నాడు

తక్షణమే క్షమాపణ చెప్పాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఒక ‘పొలిటికల్ ఇడియట్’లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. లోక్‌సభలో బుధవారం పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లు, నీట్ పరీక్షల సంస్కరణలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ దేశ విద్యార్థి లోకాన్ని ‘ఇడియట్స’తో పోల్చుతూ.. తీవ్రంగా అవమానించేలా మాట్లాడారని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆయనకు అసలు సబ్జెక్టుపై అవగాహన లేక, మాట్లాడటానికి ఏ విషయాలూ లేక పార్లమెంటు సమయాన్ని వృథా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. దేశానికి భావి భారత పౌరులు, ఈ దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను ‘ఇడియట్స్’ అని పిలవడం రాహుల్ గాంధీ అజ్ఞానానికి, విద్యార్థుల పట్ల ఉన్న చులకన భావానికి నిదర్శనమని ఫైరయ్యారు. వెంటనే విద్యార్థి లోకానికి రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ తర్నాకలోని ఆయన నివాసంలో మీడియాతో రాంచందర్‌రావు మాట్లాడారు.

ఢిల్లీ నిరసనల్లో రబ్బర్ పెల్లెట్లు వాడారంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు, గతంలో తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులను ఏ రకంగా పొట్టనబెట్టుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో 1400 మందికి పైగా విద్యార్థులు, యువకులు ప్రాణాలు కోల్పోవడానికి కాంగ్రెస్ పార్టీ వైఖరే కారణమని గుర్తుచేశారు.

ఆనాడు నాటి కాంగ్రెస్ కేంద్రమంత్రి పీ చిదంబరం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పి, ఆ తర్వాత యు-టర్న్ తీసుకొని తెలంగాణ ఆకాంక్షలను కాలరాశారని విమర్శించారు. దాంతో మనస్తాపానికి గురై వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని తెలిపారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేస్తే వారేమైనా ‘టెర్రిస్టులా’ అని ప్రశ్నిస్తున్న ప్రియాంక గాంధీ.. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తుపాకీ గుళ్లకు బలైన తెలంగాణ విద్యార్థులు టెర్రిస్టులా అని ప్రశ్నించారు.

బీజేపీని ఆర్‌ఎస్‌ఎస్ నడిపిస్తోందని విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలకు, తమ పార్టీని ఇటలీ నడిపిస్తోందనే నిజాన్ని చూసి సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ స్వయంగా తెలంగాణకు వచ్చి ‘యూత్ డిక్లరేషన్’ పేరిట ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని స్పష్టం చేశారు. యువతను తీవ్రంగా మభ్యపెట్టి మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు, విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.