calender_icon.png 5 February, 2026 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ X బిట్టు

05-02-2026 01:08:18 AM

  1. కేంద్రమంత్రి బిట్టును ‘ద్రోహి’ అన్న రాహుల్ గాంధీ
  2. దేశానికి శత్రువు రాహుల్ గాంధేనన్న రవనీత్ బిట్టు 
  3. పార్లమెంట్ ఆవరణలో మాటల యుద్ధం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 : పార్లమెంట్ ఆవరణలో బుధవారం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. విపక్షాల నిరసనల మధ్య కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకప్పుడు తన వెంటే ఉన్న బిట్టును చూసి రాహుల్ గాంధీ ‘ద్రోహి’ అని సంబోధించడంతో వివాదం మొదలైంది. నిరసన తెలుపుతున్న ఎంపీల మధ్య నుంచి వెళ్తున్న బిట్టును ఉద్దేశించి, ‘ఇక్కడో ద్రోహి వెళ్తున్నా డు.

ఈ ముఖాన్ని చూడండి’ అంటూ రాహు ల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రవనీత్ బిట్టు అంతే దీటుగా స్పందించారు. రాహు ల్ గాంధీని దేశానికి శత్రువు అని అభివర్ణిస్తూ తిప్పికొట్టారు. రాహుల్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా, బిట్టు నిరాకరించారు. పంజాబ్‌లో ఉగ్రవాదం కొనసాగిన కాలంలో సిక్కులు ఎదుర్కొన్న ఇబ్బందులకు గాంధీ కుటుంబమే కారణమని బిట్టు ఆరోపించారు.

తాను గర్వపడే సిక్కునని, దేశ శత్రువులతో కరచాలనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ వివాదంపై బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా కూడా తీవ్రంగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలు సిక్కు సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. 1980వ దశకంలో సిక్కులపై కాంగ్రెస్కు ఉన్న విషపూరితమైన ఆలోచనలు ఇప్పటికీ మారలేదని ఆయన విమర్శించారు. గతంలో కూడా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో సిక్కులపై చేసిన వ్యాఖ్యలను బిట్టు తప్పుబడుతూ, ఆయనను ఉగ్రవాదితో పోల్చిన సందర్భాలు ఉన్నాయ ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.