రెండు రోజులపాటు వర్షాలు
- నేడు గంటకు 50 కి.మీ వేగంతో గాలులు
- ఏడు జిల్లాల్లో అక్కడక్కడ వానలు
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురువనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు గంటకు 50 కి.మీ. వేగంతో వీస్తాయని తెలిపింది. దీంతోపాటు ఓ మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బంగాళఖాతంలో అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ముసురు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. సిద్దిపేట, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, హైదరాబాద్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను వాతావరణ కేంద్రం జారీ చేసింది.






