10 June, 2026 | 2:50 AM

హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన

10-06-2026 12:25 AM

చెరువును తలపించిన రోడ్లు

వాహనదారులకు ఇబ్బందులు

వర్షానికి కూలిన చెట్లు

నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

కరెంట్ తీగలు తెగిపడి ఇద్దరు దుర్మరణం

సికింద్రాబాద్/ముషీరాబాద్/కూకట్‌పల్లి/శేరిలింగంపల్లి, జూన్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం కురిసిన వాన నగరాన్ని ముంచెత్తింది. రోడ్లు చెరువును తలపించగా.. వర్షానికి చెట్లు కూలి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు కాలనీలు అంధకారమయ్యాయి.

ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబస్తీ బండ్లగూడలో వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడి జాఫర్ (25), అబూ (16) దుర్మరణం చెందారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉషా ముల్లపూడి కమాన్ సమీపంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్డు పక్కన తవ్విన గుంతలలో వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో వివేకానంద నగర్ కాలనీ నుంచి శ్రీనివాస నగర్ కాలనీకి వెళ్లే దారి మధ్యలో ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది.

దీంతో ఆరహదారిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చెట్టుకొమ్మలు విద్యుత్ వైర్ల మీద పడడంతో విద్యుత్ స్తంభాలు పెరిగిపోయి కాలనీలో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో 87.30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని  అధికారులు పేర్కొంటున్నారు. అడిక్‌మెట్‌లోని మేడిబాయి బస్తీ, చిక్కడపల్లి, గాంధీనగర్, సూర్యానగర్ తదితర ప్రాంతాలలో భారీ వర్షం వల్ల చెట్లు నేలకొరిగాయి. దీనితో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

భోలక్ పూర్ పద్మశాలి కాలనీలో ప్రాగాటూల్ చౌరస్తా నుంచి పద్మశాలి కాలనీ మీదుగా గాంధీనగర్ వరకు ప్రధాన రోడ్డులో వరదనీరు పొంగిపొర్లడంతో  వాహనదారులు, వ్యాపారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాకారంలో ఇంటి పై చెట్టుకూలడంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. పార్శిగుట్ట చౌరస్తా, ఆదర్శ్ కాలనీ, బాపూజీనగర్, ప్రేయర్ పవర్ చర్చి  తదితర ప్రాంతాలలో వర్షంనీరు పెద్దఎత్తున ఇండ్లముందునుంచి ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

విద్యానగర్ లోని పలు ప్రాంతాలలో భారీ చెట్ల కూల్పోవడంతో రహదారులు మూసివేశారు. అచ్యుత రెడ్డి మార్గంలోని బ్రహ్మంగారి గుడిలైన్ లో భారీ చెట్టు విద్యుత్ స్తంభంపై పడిపోవడంతో రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్బిఐ వెనకాలలోని మోడరన్ టవర్స్ అశోక బిల్డర్స్ సమీపంలో మరో భారీ వృక్షం  కూలిపోయింది. మసీదు లైన్ లో అపార్ట్మెంట్ సమీపంలో మరో భారీ వృక్షం కూలింది. భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలపై తీగలపై పడడంతో పూర్తిగా విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. 

హైదరాబాద్ ఐటీ కారిడార్‌ను భారీ వర్షం ముంచెత్తింది. రాయ దుర్గం మెట్రో స్టేషన్, మైండ్ స్పేస్, ఐకియా పరిసర ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. నీరు నిలిచిపోవడంతో వాహనాలు నత్తనడకన కదులుతున్నాయి. రాయదుర్గం నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, ఐకియా వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ ట్యాంక్‌బండ్ వైపు వర్షపు నీరు, మరోవైపు చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. నగరంలో భారీ వర్షంతో బేగంపేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో దాదాపు 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.