25 April, 2026 | 1:39 PM

ఆ స్థానాల్లో ఉపఎన్నిక తప్పదు!

10-05-2024 02:21 AM

సికింద్రాబాద్ ఎంపీ బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు

మెదక్ నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి 

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచార పోరు చివరి దిశకు చేరుకుంది. రెండు నెలల నుంచి అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు. గెలుపే లక్ష్యంగా హామీలు, ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ దూసుకుపోయారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు సైతం బరిలో నిలిచారు.

సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి అధికార కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్, బీఆర్‌ఎస్ తరుఫున సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పోటీ చేస్తున్నారు. అదే విధంగా మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డి నిలబడ్డారు. ఈ ముగ్గురు బీఆర్‌ఎస్ నుంచే పోటీ చేసి చట్టసభలకు ఎన్నికైవారే. వీరంతా పార్లమెంటు సభ్యులుగా విజయం సాధించేందుకు మంది మార్బలంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరి లో ఎవరు గెలిచినా రెండు స్థానాలకు ఉపఎన్నికలు తప్పవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై పార్టీలో అభ్యర్థులు ఎవరూ లేరా అంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి విమర్శించారు.

రెండోసారి గెలిపించడానికి చీకటి ఒప్పందాలు చేసుకున్నారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని మేధావులు, విద్యావంతులు మాత్రం ఉపఎన్నికలు రాకుండా, కేం ద్రంలో గెలిచే అవకాశం ఉన్న పార్టీకే మద్దతు పలుకుతామంటుండగా, మురికివాడలోని ప్రజలు తమకు పింఛన్లు, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందించిన వారే తమకు నిజమైన నాయకులని పేర్కొంటున్నారు. మరి కొంతమంది ఉచిత బస్సుసౌకర్యం, ఉచిత విద్యుత్ ఇచ్చే పార్టీలకే ఓట్లు వేస్తామని చెబుతున్నారు. ఓటు ఎవరికి వేస్తే ప్రజాధనం వృథా కాకుండా ఉంటుందో అవగాహన చేసేవారు లేకపోవడంతో ఎవరికి నచ్చిన పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధమైతున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.