23 April, 2026 | 7:45 PM

రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు

19-09-2025 03:07 PM

హైదరాబాద్: గురువారం నాడు హైదరాబాద్‌లో భారీ వర్షాలు(Rains) కురిశాయి. భారీగా కురిసిన వర్షం నగరాన్ని స్తంభింపజేసింది. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా, తెలంగాణ రాష్ట్రంలో మూడ్రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం నిజామాబాద్, సంగారెడ్డి,కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో నాలుగు జిల్లాలకూ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

గంటలకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. గురువారం సాయంత్రం ప్రారంభమైన వర్షం కొన్ని గంటల పాటు కొనసాగడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. శుక్రవారం కూడా, హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) ప్రకారం, నగరంలో అత్యధిక వర్షపాతం, 88.3 మి.మీ, బహదూర్‌పురాలో నమోదైంది. నగరంలోని చార్మినార్, నాంపల్లి ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో 70 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ ప్రకారం, నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా సంభవించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచించారు.