23 July, 2026 | 2:22 AM

పంటలకు ప్రాణం పోసిన వర్షాలు

23-07-2026 01:48 AM
  1. ఎల్ నినో భయం నుంచి కాస్త ఊరట
  2. ఆనందంలో అన్నదాతలు

జన్నారం, జూలై 22(విజయక్రాంతి): కొంత కాలంగా ఎల్ నినో ప్రభావంతో వడగాల్పులు, తీవ్రమైన ఎండలతో అల్లాడిన జన్నారం మండ ల రైతులకు వరుణుడు చల్లని కబురు చె ప్పాడు. రెండు రోజులుగా మండలంలోని వివిధ గ్రామాల్లో కురుస్తున్న వర్షాలు రైతుల పాలిట వరంలా మారాయి. నీరు లేక ఎండిపోయే దశకు చేరుకున్న వరి నారుమడులకు ఈ వర్షాలు మళ్లీ ప్రాణం పోశాయి.

కలవరపెట్టిన ఎల్నినో..

వానాకాలం సీజన్ ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురయ్యా రు. ఒకపక్క ఎల్నినో ప్రభావంతో వేసవిని తలపించేలా ఉన్న వాతావరణం, మండుతున్న ఎండలు రైతులను కలవరపెట్టాయి. తొలకరి పలకరిస్తుందన్న ఆశతో రైతులు వరి నారు పోసి సుమారు 15 రోజులు గడుస్తున్నా.. వర్షం జాడలేకపోవడంతో నారుమడులు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు మట్టిపాలవుతాయేమోనని అన్నదాతలు ఆందోళనలో కూరుకుపోయారు.

చిగురించిన ఆశలు..

రైతులు ఆశలు వదులుకుంటున్న తరుణంలో రెండు రోజులుగా వాతావరణం చల్లబడి కురుస్తున్న వర్షాలు వారిలో కొత్త ఆశలు చిగురింపజేశాయి. ఎండిపోతున్న వరి నారుమడులు ఈ వాన చినుకులతో తిరిగి జీవం పోసుకున్నాయి. పచ్చదనం సంతరించుకుంటున్న నారుమడులను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి కరుణించడంతో వాతావరణం సాగుకు అనుకూలంగా మారినట్టేనని, త్వరలోనే ముమ్మరంగా వ్యవసాయ పనులు ప్రారంభిస్తామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.