20-01-2026 12:08:22 AM
కొత్తగూడెంలో పార్టీ శ్రేణులకు ఎంపీ వద్దు రాజ్ దిశానిర్దేశం
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 19, (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ రోజురోజుకూ మరింత బలోపేతం అవుతుండడాన్ని ఓర్వలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికొచ్చి నట్టు మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ గద్దెల్ని కూల్చేయమంటూ రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి హింసను ప్రోత్సహిస్తున్నట్లుగా మాట్లాడడం తీవ్ర అభ్యంతరకర మన్నారు. కొత్తగూడెం తెలంగాణభవన్‌లో సోమవారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పడిన బకాయిల కార్డు (బాకీ కార్డ్)లు, పార్టీ మునిసిపల్ ఎన్నికల స్టిక్కర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల ఇంఛార్జి,ఎంపీ రవిచంద్ర పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ,ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 40% పైగా సర్పంచులను గెలిపించుకున్నామని, ఈ ఉత్సా హంతో మనమందరం ముందుకు సాగుదామని ఎంపీ బీఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇప్పుడొచ్చినా, ఆ తర్వాత జరిగినా,ఎప్పుడొచ్చినా కూడా మొత్తం 60 డివిజన్లలో బీఆర్‌ఎస్ విజయఢంకా మోగించడం ఖాయమని ధీమాగా చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహంతో ముందుకు వస్తున్నారని, గులాబీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు.
పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చే వారంతా పార్టీ జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, సర్వే వివరాల ఆధారంగా అభ్య ర్థిత్వం ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలవుతున్నందున ముఖ్యమైన సందర్భాల్లో ఒకటి రెండుసార్లు ఢిల్లీ వెళ్లి వస్తానని, 24 గంటలు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఈ మునిసిపాలిటీలో తిరిగి గులాబీ జెండా ఏగురవేసేందుకు మనమంతా మరింత క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగుదామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.పార్టీ నాయకులకు రవిచంద్ర, కాంతారావు,వెంకటేశ్వర రావులు స్టిక్కర్లు, బాకీ కార్డులు,ఓటర్ల జాబితాలు అందజేశారు.