గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి
కలెక్టర్ గరిమ అగ్రవాల్
గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథం ప్రారంభం
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): పశువుల సంరక్షణకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని పశు వైద్య, పశు సంవర్ధక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం ఆద్వర్యంలో సిద్ధం చేసిన ప్రచార రథాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. పశువుల పెంపకందారులు తమ జీవాల ఆరోగ్య సంరక్షణ, ఆర్థికంగా నష్ట పోకూడదనే ఉద్దేశంతో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ఉచితంగా వేయిస్తుందని పేర్కొన్నారు. పెంపకందారులు ముందస్తుగా టీకాలు వేయించి.. రోగాల బారి నుంచి జీవాలను రక్షించాలని సూచించారు.
అన్ని పాడి పశువులు, నాలుగు నెలల వయసు దాటిన ఎద్దులు, దూడలకు పశువుల పెంపకందారులు, రైతులు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, పశు వైద్య డాక్టర్లు, సిబ్బంది 26 టీమ్ లుగా ఏర్పడి వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాలు వేస్తారని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రచార రథంతో అవగాహన కల్పించాలని సూచించారు.




