calender_icon.png 20 January, 2026 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు బాధ్యతగా పనిచేయాలి

20-01-2026 12:06:21 AM

ఎస్పీ రోహిత్ రాజు

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 19, (విజయక్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులందరూ బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని ఎస్పీ రోహిత్ రాజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు.  సోమవారం షార్ట్ కట్ నందు నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల నియమావళిని అనుసరించి పటిష్టమైన ప్రణాళికను తయారు చేసుకోవాలని సూచించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ర్యాలీలు, సభలకు అనుమతి తీసుకోవడం తప్పనిసరని, ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పవని తెలిపారు.

సత్వర పరిష్కారానికి కృషి చేయాలి

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పలు కేసుల ఫైళ్లను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. న్యాయాధికారులతో సమన్వయంతో కేసుల సత్వర పరిష్కా రానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. ప్రజలు సైబర్ క్రైమ్స్ బారిన పడి తమ డబ్బును కోల్పోకుండా, నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. రౌడీషీటర్లు  అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి రవాణా, మట్కా, పేకాట, కోడి పందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి హాట్ స్పాట్స్ నందు నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, ఇల్లందు డిఎస్పి చంద్రభాను, మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, సైబర్ క్రైమ్స్ డిఎస్పీ అశోక్ , సిఐలు, ఎస్త్స్రలు పాల్గొన్నారు.