బుమ్రా X బుడ్డోడు
ముంబైతో రాజస్థాన్ ఢీ
వైభవ్ సూర్యవంశీపైనే అందరి చూపు
రీఎంట్రీ ఇవ్వనున్న హార్థిక్
వరుస విజయాలతో దుమ్మురేపుతున్న రాజస్థాన్ ఒకవైపు.. సీజన్‌ను విజయంతో ఆరంభించి రెండో మ్యాచ్‌లో పరాజయం రుచి చూసిన ముంబై మరోవైపు..వెరసి ఇరు జట్ల మధ్య ఆసక్తికర సమరానికి గువాహటి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో అందరి చూపు 15 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీపైనే అందరి చూపు ఉంది. ముంబై స్టార్ పేసర్ బుమ్రా పదునైన బౌలింగ్‌ను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది.
గుహావటి, ఏప్రిల్ 6: ఐపీఎల్ 19వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఈ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించిన రాజస్థాన్ వరుసగా రెండు విజయాలతో అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసిన రాజస్థాన్ తర్వాతి మ్యాచ్ లో గుజరాత్‌పై గెలిచింది. అహ్మదాబాద్ లో ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్చర్, తుషార్ దేశ్ పాండే అద్భుతమైన బౌలింగ్‌తో గుజరాత్ ను నిలువరించింది.
ఇప్పుడు ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న రాయల్స్ హ్యాట్రిక్ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లాలని భావిస్తోంది. రాజస్థాన్ జట్టులో ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్, వన్ డౌన్ బ్యాటర్ ధృవ్ జురెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా సూర్యవంశీ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ దుమ్మురేపుతున్నాడు. బౌలర్ ఎవరైనా భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. మంగళవారం నాటి మ్యాచ్‌లో ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు, ముంబై స్టార్ పేసర్ బుమ్రాను ఎదుర్కొనబోతున్నాడు. అలాగే జైస్వాల్ , జురెల్ కూడా రాణిస్తున్నారు. కెప్టెన్ రియన్ పరాగ్ , హెట్ మెయిర్ కూడా చెలరేగితే రాజస్థాన్‌కు తిరుగుండదు.
రాయల్స్ జట్టులో జడేజా తన మార్క్ చూపించలేదు. మరోవైపు బౌలింగ్ లో ఆర్చర్, బర్గర్ పేస్ ఎటాక్ లో కీలకం కాబోతున్నారు. గత మ్యాచ్ లో ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ పై విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ లాంటి మ్యాచ్ విన్నర్ రాజస్థాన్ జట్టుకు పెద్ద అడ్వాంటేజ్. గుజరాత్‌పై 4 కీలక వికెట్లతో తన స్పిన్ మ్యాజిక్‌ను చూపించిన బిష్ణోయ్‌ను ఎదుర్కోవడం ముంబై బ్యాటర్లకు సవాల్ గా చెప్పాలి. అతనితో పాటు సీనియర్ స్పిన్నర్ జడేజా, మరో పేసర్ సందీప్ శర్మ కూడా రాణిస్తే రాయల్స్ పైచేయి సాధించే అవకాశముంటుంది.
మరోవైపు తొలి మ్యాచ్ గెలిచి సీజన్‌ను ఘనంగా ఆరంభించిన ముంబై ఇండియన్స్ రెండో మ్యాచ్‌లో తేలిపోయింది. బ్యాటర్ల వైఫల్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం పాలైంది. హార్థిక్ పాండ్యా అనారోగ్యంతో దూరమవడం కూడా ఈ ఓటమికి కారణమైంది. ఇప్పుడు పాండ్యా ఫిట్‌నెస్ సాధించడంతో రాజస్థాన్‌పై రీఎంట్రీ ఇస్తున్నాడు. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్‌లో ఉండగా.. రికెల్టన్‌పైనా అంచనాలున్నాయి. తిలక్ వర్మ ఇంకా తనదైన మార్క్ చూపించలేదు. బౌలింగ్ పరంగా బుమ్రాతో పాటు బౌల్ట్ , కార్బిన్ బోస్చ్ , శార్థూల్ ఠాకూర్, దీపక్ చాహర్ ఉండగా.. స్పిన్ విభాగంలో మిఛెల్ శాంట్నర్ పై అంచనాలున్నాయి.
పిచ్ రిపోర్ట్
ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న గుహావటి పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. దీంతో ఇక్కడ పరుగులు చేయడం బ్యాటర్లకు సవాల్‌గానే భావిస్తున్నారు.
గత రికార్డులు:
ఇరు జట్లు 31 మ్యాచ్‌లలో తలపడగా ముంబై 16 సార్లు గెలిస్తే , రాజస్థాన్ 14 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
తుది జట్లు అంచనా
రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, జైస్వా ల్, జురెల్ (కీపర్), రియా న్ పరాగ్(కెప్టెన్), హెట్‌మెయిర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, బర్గర్,రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ
ముంబై ఇండియన్స్: హిత్ శర్మ, రికెల్టన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్థిక్ పాండ్యా(కెప్టెన్), రూథర్‌ఫర్డ్, శాంట్నర్, శార్థూల్ ఠాకూర్, బౌల్ట్, బుమ్రా




