19-10-2025 02:47:55 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో చేరికలు, వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరగా.. వారికి గులాభీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక్క పెద్ద వ్యక్తి ఇల్లు అయినా కూలగొట్టారా..? అని ప్రశ్నించారు. మూసీకి అడ్డంగా కడుతున్న వారిని ఎవరూ పట్టించుకోరు అని, బడా నేతల ఇళ్లు కూల్చడానికి హైడ్రాకు దారి దొరకట్లేదని కేటీఆర్ వెల్లడించారు.
పేదల వద్ద నివాస పత్రాలు ఉన్నా రాత్రికి రాత్రే కూలుస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి ఇల్లు చేరువులో ఉందని, కానీ ఎవరు ఆయన జోలికి మాత్రం వెళ్లరని ఆయన తెలిపారు. పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి ఇళ్లు చెరువులో ఉన్నా పట్టించుకోరని, ఆదే విధంగా కేవీపీ రామచంద్రరావు ఇంటి జోలికి కూడా వెళ్లరని వివరించారు. పెద్దల ఇళ్ల చిరునామాలు హైడ్రాకు తెలియదని, పెద్దల ఇళ్లు కూలిస్తే అడిగేవారు లేరని భావిస్తున్నారని కేటీఆర్ తెలియజేశారు. పెద్దల వద్ద డబ్బులు గుంజి బెదిరింపులకు దిగుతున్నారని, స్థిరాస్తి వ్యాపారం కుప్పకూలడానికి ప్రభుత్వ విధానాలే కారణం అన్నారు.
అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట దెబ్బకొట్టింది రాజేంద్రనగర్ నియోజకవర్గాన్నే అని, 2023 కేబినెట్ భేటీలో 400 కిలోమీటర్ల మెట్రో మంజూరు చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వివరించారు. ఎయిర్ పోర్టు మెట్రోకు టెంటర్లు పూర్తి చేస్తే రేవంత్ రెడ్డి వచ్చాక రద్దు చేశారని, నాకు భూములు ఉన్నాయనే అనుమానంతో టెండర్లు రద్దు చేశారు. రాజేంద్రనగర్ లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి భూములున్నాయని ఆరోపణలు చేశారని, భూములు చూపితే రాసిస్తానని ఆమె చెబుతున్నారని కేటీఆర్ వివరించారు. రేవంత్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా.. భూములు ఎక్కడున్నాయో చూపాలన్నారు.
కంపెనీలు, భవనాలు తనవే అని చెబుతూ రెండేళ్లుగా జల్లెడ పడుతున్నారని, గత దీపావళికి మంత్రి బాంబులేటి.. బాంబులు పేలుతాయా.. మళ్లీ దీపావళి వచ్చింది.. ఇప్పడు వాళ్ల ఇంట్లోనే బాంబులు పేలాయి అని వ్యంగ్యంగా మాట్లాడారు. బీఆర్ఎస్ హయంలో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి తీసుకెళ్లామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తుపాకులు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా దందాలు చేస్తోందని, మంచిరేవులలో కొండల్ రెడ్డి, కొండా సురేఖ మధ్య భూ వివాదం నడుస్తోందని చెప్పారు.