25 August, 2026 | 7:39 PM

మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా

25-08-2026 06:59 PM

గుండాల, (విజయక్రాంతి): తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీని నిర్వహించి, ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నాను చేపట్టారు. అనంతరం ఎంఈఓ కార్యాలయ సిబ్బందికి సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు.  మధ్యాహ్న భోజన కార్మికులు కష్టపడి వండి పెడుతుంటే, వాళ్ల వంట బిల్లులను టీచర్లు రాయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సజ్జలబోడులో సోమవారం మధ్యాహ్న భోజన కార్మికురాలు వంట వండి పెట్టినా కూడా ఆరోజు వంట వండనట్టు ఆబ్సెంట్ వేసి పంపారని నాయకులు మండిపడ్డారు. కోడిగుడ్డుకు ప్రభుత్వం ఆరు రూపాయలు చెల్లిస్తుంటే పది రూపాయలకు ఒక గుడ్డు కొనుగోలు చేసి మధ్యాహ్న భోజన కార్మికులు పెడుతున్నారని దానివల్ల ప్రతి పిల్లవాడికి నాలుగు రూపాయల మేర నష్టం వస్తుందని, ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, మెనూ ఛార్జీలు పెంచాలని నాయకులు డిమాండ్ చేశారు.

రెండు కూరలు వండే ప్రసక్తి లేదని, టీచర్లకు భోజనాలు పెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ నభీ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తోలెం గోపి, సీఐటీయూ జిల్లా నాయకులు వజ్జా సుశీల, పాయం సారమ్మ, మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ మండల కార్యదర్శి నజ్మా, స్వచ్ఛ కార్మికుల యూనియన్ కార్యదర్శి పొంబోయిన లక్ష్మీ, కొమరం రవీంద్ర, గడ్డం రమణ, ఈసం పద్మ, పూనెం సమ్మక్క, రామమ్మ, చుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.