calender_icon.png 23 February, 2026 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాంచందర్‌రావు అరెస్ట్

23-02-2026 02:00:42 AM

శనివారం రాత్రి నుంచి గృహ నిర్బంధంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఉదయం కామారెడ్డికి బయలుదేరగా అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌లోని ఇంటి వద్ద హైడ్రామా

బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట

పోలీసుల తీరుపై రాంచందర్‌రావు ఆగ్రహం

రాష్ట్రంలో నిర్బంధకాండ సాగుతోందని మండిపాటు 

రాజకీయ అరెస్టులను ఆపాలన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్/హైదరాబాద్ ఫిబ్రవరి 22 (విజయక్రాంతి):  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి, బాన్సువాడలకు వెళ్లేందుకు ఆయన ప్రయత్నించడంతో తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ తరలించారు. రాంచందర్‌రావును అరెస్టు చేసిన సమయంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరిగిన నేపథ్యంలో అక్కడకు వెళ్లేందుకు రాంచందర్ రావు సిద్ధమయ్యారు. అదే సమయంలో కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ వారు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ అక్కడికి కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి నుంచి రామచందర్ రావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు, ఆ తర్వాత అరెస్టు చేశారు. 

తెలంగాణలో నిర్బంధకాండ..

కామారెడ్డి వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేయడంపై రాంచందర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంకటర మణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై దాడి, తమ పార్టీ నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు, అరెస్టులతో కాంగ్రె స్ ప్రభుత్వం నిర్బంధకాండ సాగిస్తోందని  ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు.

బా న్సువాడ, కామారెడ్డి పర్యటన నేపథ్యంలో తనను ముందస్తుగా గృహ నిర్బం ధం, అరెస్ట్ చేయడం పూర్తిగా అక్రమం, అన్యాయమన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేకు సంఘీ భావం తెలిపేందుకు తనను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు. తమ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను నిరూపించమని ప్రశ్ని స్తే, చర్చకు సిద్ధంగా లేక దాడులకు దిగడం కాంగ్రెస్ రాజకీయ దివాళ కోరుతనానికి నిదర్శనమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బా న్సువాడకు వెళ్లి తీరుతామని, తమ ప్రజాస్వామ్య పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. 

నాడు కేసీఆర్.. నేడు రేవంత్‌రెడ్డి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

కామారెడ్డి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, హౌస్ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ ఈట ల రాజేందర్ తెలిపారు. ఈమేరకు ఆదివా రం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సొంత పార్టీ ఎమ్మెల్యేకు సంఘీభావం తెలపడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు. నాడు కేసీఆర్ ఇదే తరహా హౌస్ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని,.. నేడు రేవంత్‌రెడ్డి అదే పాటిస్తున్నాడు.. ఆయనకు పట్టిన గతే భవిష్యత్తు లో మీకూ పడుతుందని హెచ్చరించారు.  

ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న కాంగ్రెస్ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడం, నియంతృత్వంగా వ్యవహరించడంలో బీఆర్‌ఎస్ సర్కారును తలపిస్తోందని  బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆయ న నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజులుగా తనతో పాటు బీజేపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేయడం రేవంత్‌రెడ్డి సర్కార్ సాగిస్తున్న నిర్భంధకాండకు నిదర్శనమన్నారు. 

సంఘీభావం తెలిపేందుకు వెళ్లడం నేరమా?: బీజేపీ ఎంపీ డీకే అరుణ

సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వెళ్లడం నేరమా అని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అరెస్ట్‌ను ఆమె తీవ్రంగా ఖండిస్తూ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. బీజేపీని అణచివేసే కుటిల ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని విమర్శించారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి, నిర్బంధించడం హేయమైన చర్యగా తెలిపారు.  

అరెస్ట్ దురదృష్టకరం: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష్యురాలు బండ కార్తిక చంద్రారెడ్డి

బాన్సువాడలో జరిగిన హింసాత్మక ఘటనల్లో గాయపడిన కుటుంబాలను పరామర్శించేందుకు, అలాగే కామారెడ్డి ఎమ్మె ల్యే వెంకటరమణారెడ్డిని కలవడానికి వెళ్తు న్న సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష్యురాలు  బండ కార్తిక చంద్రారెడ్డి అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తున్న నాయకుడిని అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ చర్యకు రాష్ట్ర ప్రభుత్వం తప్పక సమాధానం చెప్పాల్సిందే. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో మేము వెనుకడుగు వేయమని ఆమె స్పష్టం చేశారు.

ప్రశ్నిస్తే దాడులా? కేంద్రమంత్రి బండి సంజయ్

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందా? ప్రశ్నిస్తే తమ పార్టీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును అరెస్ట్ చేయడం అన్యాయమని, ఎమర్జెన్పీ రోజులు ప్రారం భమయ్యాయని పేర్కొన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం దుర్మార్గమని ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషమని, కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సేనని, ఆత్మ రక్షణకు  అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గు చేటన్నారు. 

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమ ణారెడ్డిపై అర్థరహితంగా ఆరోపణలు చేసి, వాటిని నిరూపించాలని ఆయ న సవాల్ విసిరితే హౌస్ అరెస్టుకు పాల్పడటం కక్షసాధింపు చర్య అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అరెస్టు, కామారెడ్డిలో నెలకొన్న పరిస్థితులను ఖండి స్తూ.. కేంద్రమంత్రి జి.కిష న్‌రెడ్డి  ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.

తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందో ళనకరం గా ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేయడం.. వీటికి సమాధానం ఇవ్వమంటే.. అధికారాన్ని దుర్వినియోగం చేసి అరెస్టులకు దిగడం దారుణమన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం గేటును.. కాంగ్రెస్ నాయకులు తమ కారుతో గుద్ది ధ్వంసం చేయడం.. రాష్ర్టంలో శాంతిభద్రతల వైఫల్యానికి ఉదాహరణ అని తెలిపారు. ఎమ్మెల్యేకు సంఘీభావంగా కామారెడ్డికి వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం తెలంగాణలో అప్రకటిత అత్యవసర పరిస్థి తిని తలపిస్తోందని పేర్కొన్నారు.