10 June, 2026 | 5:27 PM

బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం

25-03-2026 11:40 AM

మురుగునీటి సమస్య పరిష్కరించకుంటే ఆందోళన తప్పదు!

​బడంగ్‌పేట్, మార్చి 25: విజయక్రాంతి):మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సమస్యలు తాండవిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రామిడి రాంరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడంగ్‌పేట్ రాజీవ్ గృహకల్ప సమీపంలో గత ఆరు నెలలుగా భూగర్భ డ్రైనేజీ పైపులు పగిలి, మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తూ చెరువును తలపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం  స్థానిక పరిస్థితులను పరిశీలించిన రాంరెడ్డి, అధికారుల పనితీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కార్పొరేషన్ కార్యాలయం పక్కనే ఇంత పెద్ద సమస్య ఉన్నా, అధికారులు నిదుర మత్తులో ఉన్నారా అని ప్రశ్నించారు. మురుగునీరు రోడ్లపై నిలిచిపోవడంతో ఇక్కడ నివాసాలు ఉంటున్నా నిరుపేదలు, అటుగా వెళ్లే పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దోమలు పెరిగి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఆరు నెలలుగా సమస్య ఉన్నా పట్టించుకోకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ​​మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి, పగిలిన డ్రైనేజీ పైపులకు మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే, స్థానిక ప్రజలను ఏకం చేసి మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రామిడి రాంరెడ్డి హెచ్చరించారు.