10 June, 2026 | 5:53 PM

చెరువులోని నల్లమట్టి పంట పొలాలకు జీవామృతం లాంటిది

10-06-2026 05:23 PM

- జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): చెరువుల్లోని సారవంతమైన వండ్రు మట్టి పంట పొలాలకు జీవామృతం లాంటిదని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. తిమ్మాజీపేట మండలం బావాజీపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న చెరువు పూడికతీత పనులను బుధవారం పరిశీలించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చెరువుల నుంచి వెలికితీసే వండ్రు మట్టిని రైతులు తమ వ్యవసాయ భూములకు తరలించుకోవడం వల్ల భూమి సారం పెరిగి పంటల దిగుబడులు మెరుగుపడతాయని కలెక్టర్ తెలిపారు. చెరువుల పూడికతీత ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జలాల మట్టాలు వృద్ధి చెందడంతో రైతులకు సాగునీటి లభ్యత మెరుగవుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను నాణ్యతతో, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు.