జోరుగా కల్తీ కల్లు..!
- ప్రమాదకర రసాయనాలు కలుపుతూ ప్రాణాలతో చెలగాటం
అధికారికంగా కొన్ని దుకాణాలు.. అనధికారికంగా మరిన్ని..
‘మామూలు’గా తీసుకుంటున్న ఎక్సైజ్ శాఖ అధికారులు
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కల్తీ కల్లు విక్రయాలు (Sale of adulterated toddy) జోరుగా సాగుతున్నాయి. కల్లు ప్రియుల అలవాటునే ఆసరాగా చేసుకుని వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రమాదకర రసాయనాలు కలుపుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ల్తీ కల్లు మహమ్మారి బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోయినా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తుంది. అనుమతులు లేకున్నా.. పలువురు వ్యాపారులు తమ పలుకుబడితో కల్తీ కల్లు విక్రయాలు సాగిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు అటువైపుగా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అడ్డుకట్ట పడేనా?
జిల్లాలోని ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలంలో కల్తీ కల్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పలువురు వ్యాపారులు అనుమతుల పేరిట చేస్తున్న అక్రమదందాకు అడ్డుకట్ట పడటం లేదు. రోజంతా కష్టపడి అలసటను తీర్చుకునేందుకు తాగే కల్లు కల్తీగా మారి పోవడంతో అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. చౌకగా దోరికే కల్తీ కల్లును తాగే వారంతా పేద, మధ్య తరగతి వారే కావడంతో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో తయారయ్యే గుడుంబాపై ఉత్సాహాన్ని చూపే అధికారులు.. నిత్యం కళ్లముందే కనిపిస్తున్న కల్తీ కల్లుపై ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదనీ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
బానిసలుగా మారుతున్న యువకులు
ఆయా మండలాల్లో యువకులు కల్తీ కల్లు కు బానిసలుగా మారిపోతున్నారు. కొన్నిసార్లు డోస్ ఎక్కువ కావడంతో చనిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎల్లారెడ్డి మండలంలోని పరిసర ప్రాంతాలలో చుట్టూ గ్రామాల నుంచి కల్తీ కల్లు కు ప్రజలను అలవాటు చేసి దందా కొనసాగిస్తున్నారు. ఇకనైనా అధికారులు మొద్దునిద్రను వీడాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదకర రసాయనాలు
ఈత, తాటి చెట్ల నుంచి తీసిన కల్లును కేవలం కుండల్లోనే చెట్ల కింద అమ్మాల్సి ఉంటుంది. కానీ, ప్రమాదకర రసాయనాలను కలుపుతూ సీసాల్లో నిల్వ చేస్తూ భారీ మొత్తం లో విక్రయిస్తున్నారు. పెద్దపెద్ద డ్రముల్లో కలుపుతూ కుంకుడుకాయ రసం, నిమ్మ ఉప్పు, చక్కెర, సాక్రిన్, యూరియా, క్లోరోఫాం, డైజో ఫాం, అల్ఫోజం వంటి మత్తు పదార్థాలను కలుపుతున్నారు. ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లో ఇదంతా జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నేతలు, గ్రామ కమిటీలకు కాసుల వర్షం
ఈ కల్తీ కల్లు దందా కొందరు నేతలకు గ్రా మ కమిటీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. తమ వ్యాపారానికి అడ్డువచ్చే పార్టీ నేతలకు, గ్రామ కమిటీలకు యేటా లక్షల రూపాయలు ముట్టచెబుతూ కల్తీ కల్లు వ్యాపారం కొనసాగి స్తున్నారు. కల్లు దుకాణాల్లో జరుగుతున్నా ప్రమాదాలను పోలీసుస్టేషన్ వరకు వెళ్లనివ్వకుండా కొందరు నేతలు సెటిల్మెంట్ చేస్తున్నారనీ స్థానికులు మండిపడుతున్నారు. ఇకనైనా అధికారులు కల్తీ కల్లు విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.