08-12-2025 08:13:20 PM
తెలుగు డిజిటల్ ఎంటర్టైన్‌మెంట్‌కి పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్న చాయ్ బిస్కెట్ మరో సంచలనానికి తెరతీసింది. దేశంలోని తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్” లో 2 నిమిషాలకు లోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయి. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చాయ్ షాట్స్ ను ప్రారంభించారు. ఇన్ఫో ఎడ్జ్ వెంచర్స్, జనరల్ క్యాటలిస్ట్ మద్దతుతో రూపుదిద్దుకున్న చాయ్ షాట్స్, ఎండ్లెస్ స్క్రోలింగ్ నుంచి స్ట్రక్చర్డ్, హై-క్వాలిటీ కథలు, ఎంటర్ టైన్మెంట్ వైపు ప్రేక్షకులను తీసుకువెళ్లడమే లక్ష్యంగా తీసుకొచ్చారు. క్రియేటర్ గేట్‌వేలో భాగంగా మధ్యవర్తులు లేకుండా నేరుగా కథలు పిచ్ చేసుకునే పోర్టల్ గా రూపొందింది.
అలాగే రాబోయే ఆరు నెలల్లో 200+ క్రియేటర్లతో కలిసి ఒరిజినల్ షోస్ రూపొందించేందుకు రూ.20 కోట్ల భారీ పెట్టుబడే లక్ష్యంగా సిద్ధమైంది. కొత్త రైటర్స్, డైరెక్టర్లు, నటులు ఎదగడానికి పెద్ద వేదికగా దీనిని లాంఛ్ చేసారు. హీరో రానా దగ్గుబాటి, శ్రీ హర్ష మజేటి & నందన్ రెడ్డి (స్విగ్గీ వ్యవస్థాపకులు) ,ఫణీంద్ర సమా (రెడ్‌బస్ స్థాపకుడు), అలఖ్ పాండే, ప్రత్యీక్ మహేశ్వరి (ఫిజిక్స్‌వాలా వ్యవస్థాపకులు), అరవింద్ సాంకా, పవన్ గుంటుపల్లి, రిషికేశ్ SR (ర్యాపిడో స్థాపకులు), రోహిత్ చెన్నమనేని (డార్విన్‌బాక్స్ సహ వ్యవస్థాపకుడు), అమర్ నగరం (విర్జియో వ్యవస్థాపకుడు) దీనిలో ఇన్వెస్టర్లుగా ఉన్నారు. శరత్ అనురాగ్ టీమ్ కు ఉన్న కల్చర్, ఆటిట్యూడ్, క్రియేటివ్ నెస్ తనకు బాగా నచ్చిందనీ, తన ప్రతి జర్నీలో వాళ్ళు ఉన్నారని హీరో రానా దగ్గుబాటి గుర్తు చేసుకున్నారు.
శరత్ అనురాగ్ ఆలోచనలు ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా ఉంటాయని ప్రశంసించారు. వాళ్ల జర్నీలో తాను ఒక చిన్న పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ జర్నీలో వాళ్ళకి ఏది కావాలన్నా తాను చేస్తాననీ, ఈ ఐడియా ని సపోర్ట్ చేస్తూ ఇందులో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పదేళ్ళు తమ చాయ్ బిస్కెట్ ప్రయాణం అద్భుతంగా సాగిందని, ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ మొదలు పెడుతున్నామనీ చాయ్ బిస్కెట్ శరత్ తెలిపారు. ప్రస్తుతం మ్యాసీవ్ తెలుగు లైబ్రరీతో లాంచ్ అయిన చాయ్ షాట్స్ భారత్‌లోని మొబైల్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న ప్లాట్‌ఫారమ్‌గా ఎదగాలనే లక్ష్యంతో త్వరలో హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బంగ్లా, అస్సామీస్ భాషల్లో విస్తరించబోతోందని వెల్లడించారు.