పదవి ఒక బాధ్యత.. అధికారం కాదు!
- శ్రీపాదరావు జయంతిలో కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్
- ప్రజల మధ్యే అమరుడైన మహనీయుడు: మంత్రి శ్రీధర్‌బాబు
- శిల్పకళా వేదికలో వైభవంగా శ్రీపాదరావు జయంతి ఉత్సవాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 2 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చారని, రాజకీయాల్లో పదవి అనేది నెత్తిన పెట్టుకునే కిరీటం కాదు, అది ప్రజలకు సేవ చేసేందుకు లభించిన ఒక బాధ్యత అని ఆయన తన జీవితాంతం చాటిచెప్పారని కర్ణాటక శాసనసభ స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ కొనియాడారు.
శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు సోమవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో వైభవంగా జరి గాయి. తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కర్ణాటక శాసనసభ స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సభాపతిగా శ్రీపాదరావు నెలకొ ల్పిన ప్రమాణాలు, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని స్మరిస్తూ ప్రముఖులు చేసిన ప్రసంగాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
యూటీ ఖాదర్ ఫరీద్ మాట్లా డుతూ.. శ్రీపాదరావు విలువల శిఖరం అని అభివర్ణించారు. సర్పంచ్ స్థాయి నుంచి మొదలై శాసనసభ స్పీకర్ వరకు ఆయన సాగించిన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాప్రతినిధి సరిగ్గా పనిచేయకపోతే ప్రజలే తిరిగి వెనక్కి పిలిచే ‘రీకాల్’ విధానాన్ని మనస్ఫూర్తిగా సమర్థించిన గొప్ప ప్రజా స్వామ్యవాది ఆయన అని ప్రశంసించారు. స్పీకర్‌గా అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకాశం కల్పించి చట్టసభల గౌరవాన్ని కాపాడారని గుర్తుచేశారు.
రాజకీయాల్లో నైతికత ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత తరుణంలో శ్రీపాదరావు చూపిన బాట నేటి తరం నాయకులకు అనుసరణీయమని చెప్పారు. సామాజిక ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో కూడా అమాయకులను రక్షించేందుకు రాజ్యాంగ పరిధిలో ఉండి ఆయన ధైర్యంగా పోరాడారని గుర్తుచేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని శ్రీపాదరావు సేవలను కొనియాడారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆయన పడిన తపన, తెలంగాణ ప్రజల పట్ల ఆయనకున్న మమకారం వెలకట్టలేనిదని వారు అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రేమ్‌సాగర్‌రావు, గండ్ర సత్యనారాయణ, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, అరికెపూడి గాంధీ, మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుడు
శ్రీపాదరావు తనయుడు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తన తండ్రిని స్మరించుకుంటూ భావోద్వేగంతో ప్రసంగించారు. ‘మా నాన్న మాకు ఆస్తులు ఇవ్వలేదు. సాటి మనిషి కోసం ఎలా నిలబడాలి, కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా ఉండాలనే నైతిక విలువల్ని మాత్ర మే వారసత్వంగా ఇచ్చారు’ అన్నా రు. తనను నమ్ముకున్న ఒక సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్తూ, ప్రజల మధ్యే ఆయన అమరుడయ్యారని, తన ఊపిరి ఆగిపోయే వరకు ప్రతి అడుగు ప్రజల కోసమే వేశారని గుర్తుచేశారు.
ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం తపించిన గొప్ప నాయకుడు, మహనీయుడు అని చెప్పారు. తండ్రి ఆశయ సాధనకు తాను నిరంతరం కృషి చేస్తానన్నారు. ఒక నాయకుడు ఎలా బతకాలో మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో ఎలా బతికిఉండాలో నిరూపించిన ధన్యజీవి శ్రీపాదరావు అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.




