25 February, 2026 | 3:19 AM

పీజీ సెట్‌లో ర్యాంకులు సాధించాలి

25-02-2026 12:24 AM

నల్లగొండ, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): పీజీ సెట్ లో మంచి ర్యాంకులు సాధించి కళాశాలకు గుర్తింపు తీసుకురావాలని స్థానిక మహిళ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర విభాగం అరవింద్ అన్నారు. కళాశాల విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ లో 30 రోజులపాటు ఉచిత శిక్షణను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ర్యాంకు సాధించాలన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఉచిత కోచింగ్ సెంటర్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, క్రమబద్ధమైన చదువు పద్ధతి, మాక్ టెస్టుల ద్వారా విద్యార్థులు పోటీ పరీక్షలకు తయారవ్వాలని, ఉచితంగా అందించే ఈ సేవ సమాజంలో విద్యా సమానత్వాన్ని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది అని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ మంజుల మాట్లాడుతూ కళాశాలకు ప్రతిరోజు వచ్చి అధ్యాపకులు చెప్పిన బోధనలను విధిగా పాటించినట్లయితే ఉన్నత విద్యలో మంచి ర్యాంకులు సాధించుకోగలుగుతారని తెలిపారు.

కళాశాల ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ టి శ్రీనివాసులు మాట్లాడుతూ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రీ కోచింగ్ సెంటర్ సమాజాభివృద్ధికి కూడా దోహదపడుతుంది అని, ఇలాంటి కేంద్రాల ద్వారా వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం పొందుతారు అని తెలిపారు.

కళాశాల గ్రంధాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సుంకరి రాజారామ్ మాట్లాడుతూ, ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల పేద విద్యార్థులకు సమాన విద్యావకాశాలు లభిస్తాయని, ఎంతో ప్రతిభ ఉన్నా, సరైన మార్గదర్శకత్వం లేక చాలామంది విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని, ఉచిత కోచింగ్ సెంటర్ స్థాపన కేవలం విద్యా కార్యక్రమం మాత్రమే కాదు, సమాజానికి అందించే అమూల్యమైన సేవ అని, ఈ ఉచిత కోచింగ్ సెంటర్ ద్వారా సరైన పాఠ్య బోధన, పరీక్షా విధానాలపై అవగాహన, సబ్జెక్ట్పై లోతైన జ్ఞానం పెంపొందించుకొని కళాశాలకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ సంధ్య, డాక్టర్ సరిత, డాక్టర్ సునీత, ఆంజనేయులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.