3 August, 2026 | 6:32 PM

కొవాగ్జిన్‌పై బీహెచ్‌యూ నివేదిక తప్పు

21-05-2024 02:33 AM

సరైన పద్ధతిలో అధ్యయనం చేయలేదన్న ఐసీఎంఆర్

న్యూఢిల్లీ, మే 20 : కొవాగ్జిన్ టీకా వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని, ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 30 శాతం మందికి నాడీ సంబంధిత చర్మ వ్యాధులు, కీళ్ల దృఢత్వం, కండరాల తిమ్మిర్లు, మహిళల్లో రుతుక్రమంలో మార్పులు వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు ఇటీవల బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఓ రిపోర్టును విడుదల చేసింది. ఈ నివేదికను స్ప్రింగర్ నేచర్ అనే జర్నర్ ప్రచురించగా.. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భల్ స్పందించారు.

కొవాగ్జిన్ టీకా వాడకంపై ప్రచురించిన నివేదకను ఆయన తప్పుపట్టారు. స్టడీ కోసం వాడిన మెథడాలజీ, డిజైన్ సరిగా లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా నివేదిక ప్రచురించారని పేర్కొన్నారు. సరైన అధ్యయనం చేయకుండానే సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయని నివేదిక ప్రచురించడం సరికాదని తెలిపారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఈ అంశంపై వెంటనే సమాధానం ఇవ్వాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హేతు బద్ధంగా లేకుండా నివేదిక ప్రచురించారని, వ్యాక్సిన్ వేసుకున్న వారికి, వ్యాక్సిన్ వేసుకోని వారికి మధ్య తేడాలను ఈ స్టడీ తేల్చలేకపోయిందని భల్ ఆరోపించారు.

బీహెచ్‌యూ చేపట్టిన కొవాగ్జిన్ స్టడీకి తాము ఎటువంటి అనుమతివ్వలేదని, ఆ స్టడీ కోసం ఎటువంటి ఆర్థిక సాయం కానీ, సాంకేతిక సాయం కానీ అందించలేదని ఐసీఎంఆర్ వెల్లడించింది. దీనిపై స్పష్టనివ్వాల్సిందిగా కొవాగ్జిన్‌పై రిపోర్టు తయారు చేసిన రచయితలకు, ఆ జర్నల్ ఎడిటర్‌కు లేఖ రాసినట్లు ఐసీఎంఆర్ డీజీ తెలిపారు. బీహెచ్‌యూ రిపోర్టుకు ఐసీఎంఆర్ గుర్తింపు ఇచ్చినట్లుగా పేర్కొనడం సరైంది కాదని, ఈ అంశాన్ని ఆ నివేదిక నుంచి తొలగించాలని ఐసీఎంఆర్ డీజీ తన లేఖలో పేర్కొన్నారు. కొవాగ్జిన్ రిపోర్టుపై వివరణను కూడా పబ్లిష్ చేయాలని ఐసీఎంఆర్ ఆ జర్నల్‌ను కోరింది.