5 April, 2026 | 5:31 AM

రెండు నెలల శిశువుకు అరుదైన గుండె సమస్య

05-04-2026 12:00 AM

కిమ్స్ కడల్స్ కొండాపూర్‌లో విజయవంతంగా చికిత్స

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): రెండు నెలల శిశువుకు అరుదైన గుండె సమస్యకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు కిమ్స్ కడల్స్ కొండాపూర్ వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ కడల్స్ కొండాపూర్ క్లినికల్ డైరెక్టర్, నియోనాటాలజీ, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హెడ్, సీనియర్ కన్సల్టెంట్ నియోనాటాలజీ, పీడియాట్రిక్స్ డాక్టర్ అపర్ణ సి తెలిపారు.ఖమ్మం జిల్లాకు చెందిన ఈ శిశువు రెండు నెలల వయస్సులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె వైఫల్య లక్షణాలతో ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఇక్కడకు చేసిన పరీక్షల్లో గుండెలో రంధ్రం ఉందని తేలింది.పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుదీప్ వర్మ నిర్వహించిన ఎకోకార్డియోగ్రామ్లో ఏఆర్ సీఏపీఏ అనే అరుదైన లోపాన్ని గుర్తించారు. సాధారణంగా గుండెకు శుభ్రమైన రక్తాన్ని అందించే రక్తనాళం (కొరోనరీ ఆర్టరీ) ఒక ప్రత్యేక మార్గం (ఏఓర్టా) నుంచి రావాలి. కానీ ఈ చిన్నారిలో అది తప్పుగా ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళం (పల్మనరీ ఆర్టరీ) నుంచి వస్తోంది. ఏఓర్టోగ్రామ్ ద్వారా దీనిని నిర్ధారించారు.

అనంతరం చిన్నారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాం.శస్త్రచికిత్సలో భాగంగా, రైట్ కొరోనరీ ఆర్టరీని పల్మనరీ ఆర్టరీ నుంచి వేరు చేసి, ప్రత్యేక హుడ్ టెక్నిక్ సహాయంతో ఏఓర్టాకు అనుసంధానం చేశారు. దీంతో గుండెకు సరైన ఆక్సిజన్‌తో కూడిన రక్త ప్రవాహం పునరుద్ధరించబడింది. శస్త్రచికిత్స అనంతరం రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు కావాల్సిన మందులు అందించాం.

శస్త్రచికిత్స తర్వాత శిశువును నీయోనేటల్ ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ సపోర్ట్, ఇనోట్రోప్స్ సహాయం, అవసరమైన చోట పెరిటోనియల్ డయాలిసిస్ వంటి చికిత్సలు అందించాం.ఇంత చిన్న వయస్సు ఉన్న శిశువులపై గుండె శస్త్రచికిత్స చేయడం సవాలుతో కూడుకున్నదని అన్నారు. అన్ని సవాళ్ల ను అధిగమిస్తూ ఈ శస్త్రచికిత్స విజయవంతమై, ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉండి నీయోనేటల్ ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేశాం.

ఈ శస్త్రచికిత్సలో సీనియర్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అనిల్, కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ నాగరాజన్, డాక్టర్ సి. అపర్ణ (క్లినికల్ డైరెక్టర్) నేతృత్వంలోని నీయోనటాలజీ బృందం డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ అమిత్, డాక్టర్ ఇషిత, డాక్టర్ రాజశేఖర్, ఈ కేసులో కీలక పాత్ర పోషించారు. ఆధునిక నీ యోనటల్ కార్డియాక్ కేర్ సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్ల ప్రాణాపాయ పరిస్థి తుల్లో ప్రాణాలు కాపాడవచ్చన్నారు.