28 August, 2026 | 4:50 AM

రైతుల్లేని అవగాహన సదస్సు..

27-08-2026 05:29 PM

ఖాళీ కుర్చీలతో ‘ఎఫ్‌ఎఫ్‌ఎస్‌’ ప్రచారం!

అధికారుల సమాచార లోపంతో రైతు వేదిక వెలవెల

11 గంటల వరకు రైతుల జాడే లేదు..

కార్యాలయానికి వచ్చిన నలుగురిని కూర్చోబెట్టి సదస్సు పూర్తి చేసినట్లు ప్రచారం?

కొల్చారం: నూతన ఫర్టిలైజర్‌ వ్యవస్థ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌)పై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం కొల్చారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు రైతుల్లేకుండా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. యాప్‌ వినియోగంపై అవగాహన లేక రైతులు ఇప్పటికే యూరియా బుకింగ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, అవగాహన సదస్సుకు రైతులను రప్పించడంలోనే అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేసుకోవాల్సి ఉండగా, యాప్‌పై సరైన అవగాహన లేక అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులకు యాప్‌ వినియోగంపై అవగాహన కల్పించేందుకు మండల వ్యవసాయ శాఖ గురువారం ఉదయం 10.30 గంటలకు కొల్చారం రైతు వేదికలో ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేసింది.

అయితే సదస్సు నిర్వహణపై రైతులకు ముందస్తు సమాచారం అందించడంలో అధికారులు విఫలమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్ణీత సమయానికి రైతు వేదికకు ఒక్క రైతు కూడా హాజరుకాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. సుమారు 11 గంటల వరకు రైతుల కోసం ఎదురుచూసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోయినట్లు తెలిసింది.

నలుగురితోనే అవగాహన సదస్సా?

వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన నలుగురు రైతులను రైతు వేదికలో కూర్చోబెట్టి వారికి యాప్‌పై అవగాహన కల్పించి సదస్సు నిర్వహించినట్లు చూపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు విస్తృతంగా సమాచారం అందించి వారి సమస్యలను తెలుసుకోవాల్సిన అధికారులు, తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని ముగించారంటూ పలువురు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

యూరియా బుకింగ్‌లో రైతులు ఇబ్బందులు పడుతున్నా.. వారిని పిలిచి అవగాహన కల్పించాల్సిన సదస్సే ఖాళీ కుర్చీలతో సాగడం వ్యవసాయ శాఖ పనితీరుకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, తుక్కాపూర్‌ ఏఈఓ అమృత్ తదితరులు పాల్గొన్నారు.