గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్
గర్భాశయ ఫైబ్రైడ్ (లియోమయోమాస్) తొలగింపు
గజ్వేల్, మార్చి 3: గజ్వేల్ లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్లు ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన 43 ఏళ్ల మహిళకు గర్భాశయం కండర గోడలలో పెద్ద కణిత పెరగడంతో (ఫైబ్రైడ్ ) లియోమయోమాస్ అనే అరుదైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ త్రివేణి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రేమ్ కిషోర్, అనస్థీషియా డాక్టర్ మైపాల్, డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ ఆఫీసర్స్ సునీత, సునీల్, థియేటర్ అసిస్టెంట్లు సిహెచ్ ,వెంకట్ రాజకుమార్, పి. రాజు, యాదమ్మ పాల్గొన్నారు.
ఒక టీం గా ఏర్పడి ఇంత పెద్ద పైబ్రేడ్ ను తొలగించినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ ఇది మహిళల గర్భాశయంలో కనిపించే అత్యంత అసాధారణమైన కణతి అని చాలామంది రోగులలో కనిపించవన్నారు.
అయినప్పటికీ 30% మంది అసాధారమైన గర్భాశయ రక్తస్రావము, కడుపులో నొప్పి, రక్తహీనతకు కారణం కావచ్చని, పొత్తికడుపు పూర్తిగా నిండడం వంటి భావన, అత్యవసర మూత్ర విసర్జన, నొప్పితో కూడిన అలసట, అంతర్గత రుతుస్రావము, దిగువ వెన్నునొప్పి, సంతానలేమి, బహుళ గర్భ స్రావాలు, గర్భ దారణలో ఇబ్బందులు కలుగుతాయన్నారు. ఎవరైనా ఈ ఇటువంటి లక్షణాలు ఉంటే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సంప్రదించాలన్నారు.




