రేషన్ డీలర్ల బియ్యం దందా..!
- లబ్ధిదారుల వేలిముద్రల ఆధారంగా డబ్బుల పంపిణీ
సేకరించిన బియ్యాన్ని రీసైక్లింగ్ కోసం మిల్లర్లకు తరలింపు
పట్టించుకోని పౌరసరఫరాల శాఖ అధికారులు
సన్న బియ్యం పంపిణీ చేసినా ఫలితం శూన్యం
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 16 ( విజయక్రాంతి )నిరుపేదల అర్ధాకలి తీర్చాలన్న లక్ష్యంతో ఏర్పడిన రేషన్ బియ్యం పంపిణీ దళారులకు కల్పతరువుగా మారింది. రైతు లు పండించిన ధాన్యాన్ని పిఎసిఎస్, మెప్మా, ఐకెపి ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి జిల్లాలోని ఆయా రైస్ మిల్లర్లకు కేటాయించి క్వింటాల్ కి 60 కిలోల చొప్పున బియ్యంగా మార్చి తిరిగి సీసీఐ, ఎఫ్సిఐ కి అప్పగించేలా అక్కడి నుండి తిరిగి గోదాముల ద్వారా రేషన్ డీలర్ సహాయంతో నిరుపేదలకు బి య్యం పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వమే అనేక విధాలుగా నిధులు కేటాయిస్తూ నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల నుండి ఒకేసారి మూడు నెలల బియ్యం కోట లబ్ధిదారుడికి పంపిణీ చేస్తున్నడంతో రేషన్ డీలర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. లబ్ధిదారుడికి చిన్నచిన్న సాకులు చెబుతూ ఒకటి లేదా రెండు నెలల కోట అప్పజెప్పి మిగిలిన కోట డబ్బులు ముట్టజెప్పి బియ్యం దందా సాగిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి కొంతమంది రేషన్ డీలర్లు బియ్యం సక్రమంగా రావడం లేదం టూ లబ్ధిదారులకు కావాలంటే డబ్బులు ఇస్తామంటూ రేషన్ డీలర్ దుకాణంలోనే దందా స్థాగిస్తుండడం విశేషం.
రైతుల ద్వా రా సేకరించిన ధాన్యాన్ని ఆయా రైస్ మిల్లర్లు నిర్దేశించిన సమయానికి ప్రభుత్వానికి బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా నిర్లక్ష్యం వహిస్తూ రీసైక్లింగ్ ద్వారా వచ్చిన బియ్యం తిరిగి ప్రభుత్వానికే పంపిణీ చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో రేషన్ దందా మాఫియాకు రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారుల మద్దతు పుష్కలంగా లభిస్తోందనే వాదన వినిపిస్తోంది.
రైతుల నుండి సేకరించిన వరి ధాన్యం రైస్ మిల్లర్లకు కేటాయించగా రేషన్ దందా చరిత్ర కలిగిన కొంతమంది రైస్ మిల్లర్లు వరి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసి కోట్లకు పడగలెత్తుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ తంతు కొన్నేళ్లుగా జరుగుతున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధు లు అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో ప్రస్తుతం ఈ దందా మరింత పేట్రేగిపోతుందని స్థానికంగా చర్చ జరుగుతుంది.
ఈ దందాలు అరికట్టాల్సిన సివిల్ సప్లై శాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితమై నెలవారి మామూళ్లకు అలవాటు పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా కొంత మంది నుండి తరచూ ఫిర్యాదులు అందుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం వెనక గ్రామస్థాయి నుంచి జిల్లా ఉన్నత స్థాయి అధికారుల వరకు ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలకు బలం చేకూరుతోందని చర్చ జరుగుతోంది.
గోదాం నుండి నేరుగా రైస్ మిల్లర్లకే..!?
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం ఫేస్ 1 నుండి ఫేస్ 2 గోదాంలకు సరఫరా అవుతూ గోదాముల నుండి నేరుగా రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. గతంలో జరిగిన ప్రక్రియలో ప్రస్తుతం అక్రమార్కులకు దూర భారం పెరుగుతోందని భావిస్తూ రేషన్ డీలర్లతో కుమ్మక్కై గోదాముల నుండి నేరుగా ఆయా రైస్ మిల్లర్లకే రీసైక్లింగ్ ప్రక్రియ కొరకు సన్నబియ్యం పంపి ణీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సన్న బియ్యం కిలో 20 చొప్పున లబ్ధిదారుడికి ఫోన్ పే లేదా నగదు రూపంలో చెల్లిస్తూ రేషన్ దుకాణాల్లో స్టాక్ మెయింటెన్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు బియ్యమే కావాలని వాదనకు దిగుతున్న పరిస్థితి. ఈ వ్యవహారంపై కొంతమంది లబ్ధిదారులు ప్రజా సంఘాలు రేషన్ డీలర్ల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్న పరిస్థితి.
అయినా జిల్లా సంబంధిత శాఖ అధికారులు ఉన్నతాధికారులు ఈ వ్యవహారం పట్ల చర్యలకు వెనకడుగు వేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఆయా రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యం ప్రభుత్వానికి బియ్యం పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహించిన రైస్ మిల్లర్ల పై చర్యలకు సైతం అధికారులు వెనకడుగు వేస్తున్న వ్యవహారంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దందా వ్యవహారం వెనుక కొంతమంది అధికారుల హస్తమున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.






