దేశ విభజనలా ఏపీ, తెలంగాణ విభజన
- బ్రిటిషోళ్ల కంటే దారుణంగా కాంగ్రెస్ పార్టీ తీరు
- డీలిమిటేషన్‌పై కావాలనే విపక్షాల రాద్ధాంతం
- బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య
న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౬: డీలిమిటేషన్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తోంది రాద్ధాంతమేనని, మహిళా రిజర్వేషన్ల బిల్లు అడ్డుకోవడమే వాళ్ల ధ్యేయంగా కనిపిస్తోందని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులపై చర్చ సందర్భం గా ఆయన విపక్షాలపై దుమ్మెత్తిపోశారు. భారత్ విభజన సమయంలో బ్రిటిష్ పాలకులు వ్యవహరించిన తీరు కంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజనను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా చేసిందని వ్యాఖ్యానించారు.
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగుతుందనేది అవాస్తవమని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల వాటాను 50శాతానికి పెంచడమే కేం ద్ర ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ‘1996 నుంచి మహిళా రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉంది. గత ప్రభుత్వాలు బిల్లును విస్మరించా యి. కానీ, ప్రధాని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని మహిళలందరి తరపున మోదీకి ధన్యవాదాలు. కానీ, మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆలస్యమయ్యేలా ప్రతిపక్షాలు కొత్తదారులు వెతుకుతున్నాయి.
రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ తప్పనిసరి. ఈ విషయంలో దక్షిణాది ప్రజలను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నాయి. తమిళనాడులోనూ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. కానీ, డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగదు. డీలిమిటేషన్ సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవాలని విపక్షాలు చూస్తున్నాయి. మహిళా బిల్లును విపక్షాలు అడ్డుకోవడం సరికాదు’ అని పేర్కొన్నారు.






