5 July, 2026 | 6:29 PM

వయసుకు డిస్కౌంట్ ఉండదు: ధోనీ

22-05-2024 02:02 AM

న్యూఢిల్లీ: ఐపీఎల్ 17వ సీజన్‌లో సూపర్ ఫిట్‌నెస్‌తో కనిపించి అభిమానులను ఉత్సాహపరిచిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టాడు. ప్రతీరోజు హార్డ్ వర్క్ చేయడమే తన అందుకు కారణమని తెలిపాడు. అయినా ప్రొఫెషనల్ క్రీడలో ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు వయసులో ఎవరు డిస్కౌంట్  ఇవ్వరని ధోనీ అభిప్రాయపడ్డాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. తాజా సీజన్‌లో లీగ్ దశలోనే ఇంటిబాట పట్టగా.. ధోనీ తన భారీ హిట్టింగ్‌తో అభిమానులను అలరించాడు. సీఎస్కే నిష్క్రమణ అనంతరం ధోనీ తొలిసారి స్పందించాడు. ‘ఏడాదిగా నేను క్రికెట్ ఆడకపోవడం కఠినమైన పరిస్థితే.

ఆటలో కొనసాగాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే. ఒక్కసారి మ్యాచ్‌లో దిగితే యంగ్‌స్టర్స్‌తో సమానంగా పోటీ పడాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు వయసు విషయంలో ఎవరు డిస్కౌంట్ ఇవ్వరు. వయసు పెరిగేకొద్ది ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలంటే తిండి అలవాట్లతో పాటు శిక్షణపై శ్రద్ద పెట్టాల్సిన అవసరముంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. మానసికంగా యాక్టివ్‌గా ఉండేందుకు నాకిష్టమైన ఫార్మింగ్, బైక్ రైడింగ్, వింటేజ్ కార్ కలెక్షన్‌తో కాలక్షేపం చేస్తున్నా.  నేను సొంతంగా ఏర్పాటు చేసుకున్న గ్యారేజీలో కొన్ని గంటల పాటు గడిపితే చాలు ఫుల్ చార్జ్ అయిపోతా’ అని ధోనీ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో చెన్నై తరపున 14 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 220.55 స్ట్రుక్‌రేట్‌తో 161 పరుగులు సాధించాడు. మరి వచ్చే సీజన్‌లో ఆడుతాడా లేక ఇదే చివరి సీజన్ కానుందా అనే విషయంపై ధోనీ ఇంతవరకు స్పందించలేదు.