28 February, 2026 | 9:34 PM

ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో రమాదేవి

28-02-2026 07:56 PM

మెదక్,(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే క్రమంలో శనివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మెదక్ లో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను మెదక్ ఆర్డీవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా హాళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరును, పరీక్షల నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించారు.

విద్యార్థుల హాజరు వివరాలను ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే ప్రశ్నాపత్రాలను తెరిచారా లేదా అన్నది పరిశీలించారు. సీసీటీవీ నిఘా మధ్య ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, మెడికల్ కిట్‌తో ఏఎన్‌ఎం అందుబాటులో ఉండటం, టాయిలెట్ వసతులు వంటి మౌలిక సదుపాయాలను కూడా పరిశీలించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షలు పూర్తైన వెంటనే ఆన్సర్ షీట్లను తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు సురక్షితంగా తరలించాలని సూచించారు. ఎలాంటి కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆర్ డి ఓ స్పష్టం చేశారు.