విత్తనాల కొనుగోలులో రశీదు తప్పనిసరి
బిజినేపల్లి: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఆయా పంట విత్తనాల కొనుగోళ్లు చేసే రైతులు సదరు వ్యాపారి వద్ద రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి యశ్వంత్ రావు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని పలు వ్యవసాయ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా డీఏఓ యశ్వంత్ రావు మాట్లాడుతూ.. రశీదులో కొనుగోలు చేసిన విత్తనాల లాట్ నెంబరుతో పాటు, వ్యాపారి సంతకం, రైతు సంతకం తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
పంట కాల పూర్తి అయ్యే వరకు రశీదును జాగ్రత్తగా దాచి పెట్టుకోవాలని సూచించారు. విత్తనాలతో పాటు, పురుగు మందులు, ఎరువులు కొనుగోలు చేస్తే రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అంతే కాక గడ్డి నివారణ మందుల అమ్మకాలు నిలిపి వేసిన్నట్లు తెలిపారు. గడ్డి మందు అవసరం ఉన్న రైతులు తప్పకుండా మండల వ్యవసాయశాఖ అధికారి అనుమతి పత్రం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గడ్డి మందు అమ్మకాలపై నిలిపి వేశామన్నారు. ఎక్కడైనా రహస్యంగా అమ్మకాలు జరిగితే సమాచారం ఇవ్వాలన్నారు.






