శాంతించిన వరుణుడు.. తగ్గిన వాన
హైదరాబాద్: మంగళవారం తెల్లవారుజామున తీవ్ర మేఘాలు పేలడంతో హైదరాబాద్ అంతటా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని చాలా ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. నగరంలోని సరూర్‌నగర్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, రాజేంద్రనగర్, అబిడ్స్, నాంపల్లి, మెహదీపట్నం, నాగోల్, తెల్లాపూర్, బోడుప్పల్, మధురానగర్, గచ్చిబౌలి, చైతన్యపురి, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టోలీ చౌకీ ముషీరాబాద్, శివరాంపల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్లీ వర్షం ప్రారంభం కానున్నట్లు సమాచారం. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావారణ శాఖ వెల్లడించింది. భారీగా కురిసన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రహదారులపై చేరిన నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది కాలువల్లోకి మళ్లించారు.
నాలాలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పురాతన, శిథిల భవనాల పరిసరాల్లో ఎవరూ ఉండొద్దని జీహెచ్ఎంసీ సూచించింది. భారీ వర్షాల దృష్ట్యా జలమండలి అప్రమత్తమైంది. జీఎం, డీజీఎం, మేనేజర్ తో జలమండలి ఎండీ జూమ్ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు జలమండలి ఎండీ సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ పై దృష్టి పెట్టాలని జలమండలి ఎండీ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే 155313కి ఫోన్ చేయాలని సూచించారు. అటు మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల దృష్ట్యా జలమండలి ఉద్యోగులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.






