5 May, 2026 | 5:32 PM

పాఠశాల విద్యలో సంస్కరణలు అవసరం!

24-06-2024 01:26 AM

ప్రభుత్వానికి ఉపాధ్యాయుల ప్రతిపాదనలు

తక్షణమే అమలు చేయాలని సీఎంను కోరిన హెచ్‌ఎం సంఘం

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యావిధానం వల్ల ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడంలేదని, రీఫార్మ్స్ రావాలని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌రెడ్డిని ఆదివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నేతలు రాజభాను చంద్రప్రకాశ్, రాజగంగారెడ్డితోపాటు మరికొంత మంది నేతలు కలిసి పలు ప్రతిపాదనలు సమర్పించారు. 2016లో జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా విద్యాశాఖను పునర్‌వ్యవస్థీకరించక పోవడంతో పాఠశాల పరిపాలన పూర్తిగా విధ్వంసానికి గురైందని తెలిపారు. 

ఎడ్యుకేషన్ డివిజన్లు తేవాలి

రెవెన్యూ డివిజన్ల మాదిరిగా ఎడ్యుకేషన్ డివిజన్లను రీఆర్గనైజ్ చేయాలన్నారు. తెలంగాణలో ఉన్న 615 మండలాల్లో ప్రతి 4/5 మండలాలను ఒక విద్యా డివిజన్‌గా పరిగణిస్తూ మొత్తం 120 నుంచి 150 విద్యా డివిజన్లను ఏర్పరచాలి. ప్రతి మండలాన్ని ఎడ్యుకేషన్  బ్లాకులుగా గుర్తించాలి. డివిజన్లు, బ్లాకులకు ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను కేటాయించి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. సీటీఈ, ఐఏఎస్‌ఈ, ఎస్‌సీఈఆర్టీ, ఎస్‌ఐఈటీ, జీసీపీఈ, డీఐఈటీలలో గత 20 సంవత్సరాలుగా ఉన్న ఖాళీలను వెంటనే ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలి. గత 19 ఏళ్లుగా 16 మంది రెగ్యులర్ ఎంఈవోలు ఒకే చోట పనిచేస్తున్నారు. వారికి బదిలీలు నిర్వహించాలి. 

ఆ నిబంధనలు రద్దు చేయాలి 

నూతనంగా అమలుపరిచిన రాష్ర్టపతి ఉత్తర్వులు- ప్రకారం జిల్లా, మండల పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులందరూ లోకల్ క్యాడర్ ఆర్గనైజ్ అయ్యారు. కాబట్టి ప్రభుత్వానికి ఉన్న విశేషాధికారాలను వినియోగించి ప్రస్తుతం పాఠశాల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి అడ్డుగా ఉన్న ఉమ్మడి రాష్ర్టంలోని నిబంధనలను రద్దు చేయాలన్నారు. ఆ తర్వాత అవసరమైన కొత్త పోస్టులు, క్యాడర్లు క్రియేట్ చేయడం, తెలంగాణ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్, తెలంగాణ సబార్డినేట్ సర్వీసు రూల్స్ రూపొందించాలన్నారు. ప్రతి పాఠశాలలో తరగతి గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, వాటర్ ట్యాంక్ ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ఇంకా కొన్ని స్కూళ్లలో వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఆన్‌లైన్ విద్య, ఆర్థిక అంశాలు

ప్రైవేట్ బడులతో పోటీ పడాలంటే ఆన్‌లైన్, కంప్యూటర్ విద్యను ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మరింత చేరువ చేయాలి. దీనికిగానూ అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తూ, ఆన్లున్ వ్యవస్థ, విద్యార్థుల కొరకు కంప్యూటర్స్ అందజేయాలి. ఇతర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అందించిన మాదిరిగానే నాణ్యమైన భోజనము, అల్పాహారం విద్యార్థులకు అందజేయాలి. కుకింగ్ కాస్ట్‌ను పెంచాలని కోరారు. ఈ-కుబేర్ సిస్టంను తొలగించి గతంలో మాదిరిగా ట్రెజరీల ద్వారా చెల్లింపులు జరగాలి. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు, 2024 జనవరి 1 నుంచి రావాల్సిన నాలుగో డీఏను కూడా కలిపి పకటించాలన్నారు.