14-02-2026 09:55:22 PM
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపణ
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పలువురు నేతలు తప్పుడు పత్రాలను సృష్టించి తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపించారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో కోనప్ప మాట్లాడారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు లేనప్పటికీ తప్పుడు పత్రాలు సృష్టించి ఓటరు జాబితాలో తన పేరు చేర్చించుకుని ఎక్స్ ఆఫిషియో సభ్యునిగా సమావేశంలో పాల్గొని ఓటు వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఈ నెల 16న జరగనున్న మున్సిపల్ సమావేశంలో ఇటీవల గెలిచిన కౌన్సిలర్లతో పాటు ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ సమావేశానికి ఎక్స్ ఆఫిషియో సభ్యులు కూడా హాజరవుతారు. ప్రభుత్వ ఆదేశాలు, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం... మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు వినియోగించే ప్రజాప్రతినిధులకే ఎక్స్ ఆఫిషియో హోదా వర్తిస్తుంది. కానీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దండే విఠల్ పాల్గొనలేదని, ఓటు కూడా వేయలేదని, ఆ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫైనల్ ఓటర్ లిస్ట్‌లో ఆయన పేరు లేదని కోనప్ప ఆరోపించారు.
అదనంగా విడుదలైన చేర్పుల జాబితాలో కూడా పేరు లేదని పేర్కొన్నారు. గత 10–15 రోజులలో కొత్త ఓటరు నమోదు ప్రక్రియ కూడా జరగలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓటర్ లిస్ట్‌లో దండే విఠల్ పేరు ఉన్నట్లు చూపించడం అనుమానాస్పదమని, ఇది చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, ఎన్నికల కమిషనర్ పూర్తి స్థాయి విచారణ జరిపి, దండే విఠల్‌ను ఎక్స్ ఆఫిషియో సభ్యునిగా కొనసాగించకూడదని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.