లేని భూమి ధరణిలో నమోదు!
- అక్రమంగా బ్యాంక్ రుణాలు, రైతుబంధు
- ప్రభుత్వ రుణమాఫీతో బట్టబయలు
- షాకవుతున్న బ్యాంకు మేనేజర్లు
- నిందితులపై చర్యలకు ఆర్మీ జవాన్ పోరాటం
- కామారెడ్డి, డిసెంబర్ 9 (విజయక్రాంతి): భూములు ఉండి, పట్టా ఉండి బ్యాంక్ రుణం కోసం రైతులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నా బ్యాంక్ అధికారులు రుణాలు ఇవ్వని పరిస్థితి ఉన్నది. కామారెడ్డి జిల్లాలో కొందరు అక్రమార్కులు లేని భూములను ధరణిలో నమోదు చేయించుకుని, పట్టాలు పొంది, రూ.లక్షల్లో బ్యాంక్ రుణాలు పొందా రు. ఇటీవల ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వాటిని చూసి బ్యాంక్ మేనేజర్లు నోరు వెల్లబెడుతున్నారు. భూము లే లేని వాటికి గతంలో బ్యాంకు అధికారులు రుణాలు ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదంటున్నారు. పైరవీకారులు, అక్రమార్కు లు కలిసి రైతుబంధుతో పాటు బ్యాంకుల్లో రుణాలు పొంది మాఫీతో లబ్ధిపొందారు. కామారెడ్డి జిల్లాలో అక్రమార్కులపై ఓ ఆర్మీ జవాన్ పోరాటం చేస్తున్నారు.
స.హ.తో బయటపెట్టిన జవాన్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రం లో సర్వే నంబర్ 321లో నాలుగు ఎకరాల భూమి ఉందని ధరణిలో కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బ్యాంక్ నుంచి రుణాన్ని పొందడంతో పాటు రైతుబంధు కూడా వచ్చింది. ఇటీవల ప్రభుత్వం రుణామాఫీ కూడా అయింది. సెలవుల్లో తన స్వగ్రామానికి వచ్చిన ఆర్మీ జవాన్‌కు ఈ విషయమై అనుమానం కలిగింది. లేని భూమికి రైతుబంధు, రుణమాఫీ ఎలా వర్తించాయో చెప్పాలని జుక్కల్ తహసీల్దార్ హిమబిందును కోరారు.
కానీ ఎలాంటి వివరాలు అందించలేదు. దీంతో సమాచార హక్కు చట్టం ద్వారా సర్వే నంబర్ 321లో ఎంత భూమి ఉన్నదో తెలపాలని దరఖాస్తు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు చేసేదేమీలేక ఒక ఎకరం 7 గుంటల భూమి మాత్ర మే ఉన్నదని సమాచారం ఇచ్చారు. దీనిపై హైదారాబాద్‌లోని సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్‌ను, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను ఆర్మీ జవాన్ గోపికృష్ణ పలుమార్లు కలిసి ఈ విషయం వివరించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు జుక్కల్ నియోజకవర్గంలో చాలా ఉన్నాయని, వాటిని గుర్తించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






