16 April, 2026 | 5:07 AM

విద్యాసంస్థలను నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమా?

28-02-2026 12:21 AM

విద్యా ఆరోగ్య శాఖ మంత్రికి లేఖతో పాటు సమస్యను ఫోన్ ద్వారా వివరించిన మాజీ మంత్రి

సానుకూలంగా స్పందించిన దామోదర రాజనర్సింహ 

వనపర్తి, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ కోసం 8ఎకరాల స్థలం కేటాయించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమా అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన మెడికల్ కళాశాలను సందర్శించి విద్యార్థుల ను కలసి కళాశాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడు తూ జిల్లా కేంద్రములో అత్యంత ఉన్నత ప్రమాణాలతో మెడికల్ కళాశాల ఉండాలని భావి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండాలని మెడికల్, ప్యారా మెడికల్, హాస్టల్, రీసర్చ్ సెంటర్,వసతిని దృష్టిలో ఉంచుకొని 50 ఎకరాలతో సువిశాలమైన మెడికల్ కళాశాల ఆవరణ ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో నర్సింగ్ కాలేజ్ పూర్తి అయి అందులో ప్రస్తుతం మెడికల్ కళాశాల కొనసాగిస్తున్నారని అదేవిధంగా మెడికల్ కళాశాల అన్ని హంగులతో రూపుదిద్దుకుంటుందన్నారు. ప్రభుత్వం అనాలోచిత చర్యలతో మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ కోసం 8ఎకరాలు కేటాయించడం అనైతిక చర్య అని దుయ్యబట్టారు.

రాబోవు రోజుల్లో మెడికల్ కళాశాలకు అనేక మౌలిక వసతుల కోసం స్థలం అవసరమని ప్రభుత్వం పునః పరిశీలించి యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలమును ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలు అనేకం ఉన్నాయని వాటిలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మించాలని మాకు ఎటువంటి అభ్యంతరం లేదని, సంప్రదింపులు,చర్చలు లేకుండా ఏకపక్షంగా కేటాయించడం పద్ధతి కాదని అన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కి నిరంజన్ రెడ్డి లేఖ...

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కి మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడి పరిస్థితులను వివరిస్తూ లేఖా వ్రాసి స్వయంగా ఫోన్ చేసి పునఃపరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,తదితరులు ఉన్నారు.