24 June, 2026 | 1:26 AM

ఆరంభంలో ఊరిస్తూ.. ఆఖర్లో ముంచేస్తూ..!

11-06-2024 12:44 AM

నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

203 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

23,259 స్థాయికి జారుకున్న నిఫ్టీ

ఐటీ రంగంతో పాటు మరికొన్ని రంగాల షేర్లలో పోటెత్తిన అమ్మకాలు 

ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన జోరులో సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు జోష్ కనబరిచాయి. తీవ్ర ఒడిదొడుకుల మధ్య కొనసాగిన దేశీయ సూచీలు చివరకు నష్టాలను చవిచూశాయి. ఒకానొక దశలో తొలిసారి 77 వేల పాయింట్ల స్థాయిని అధిగమించి జీవితకాల గరిష్టాన్ని తాకాయి. చివరకు అమ్మకాలు వెల్లువెత్తడంతో 203 పాయింట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఐటీతోఒ పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ వంటి సంస్థలతో పాటు మరికొన్ని రంగాల్లో అమ్మకాలు జరగడంతో సూచీలు నష్టాల బాట పట్టాల్సి వచ్చింది. 

ముంబై, జూన్ 10: సోమవారం ఉద యం సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 77,079 పాయింట్లకు ఎగబాకింది. 77 వేల పాయింట్లను తాకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిఫ్టీ కూడా సరికొత్త  రికార్డులు సృష్టిస్తూ.. 23,412 పాయింట్లకు ఎగబాకింది. గతంలో చూసుకుంటే ఏ సోమవారం కూడా 23,400 మార్కును దాటలేదు. తొలిసారిగా నిన్ననే ఆ మార్కును దాటింది. తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్ 203 పాయింట్ల నష్టానికి (0.27 శాతం) 76,490 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ చూసుకుంటే 31 పాయింట్ల నష్టం (0.13 శాతం) తో23,259 పాయింట్ల వద్ద స్థిరపడింది. దీంతో గత మూడు రోజులుగా వస్తున్న లాభాలకు బ్రేక్ పడినట్టయింది.

నష్టాలు చవిచూసిన కంపెనీలు.. 

టెక్ ఎం, ఇన్ఫోసిస్, విప్రో, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్, మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టైటాన్ కంపెనీ, ఐటీసీ కంపెనలు 0.5 శాతం నుంచి 2.6 శాతం మేర నష్టపోయాయి.

లాభాల బాటలో..

రామ్‌కో సిమెంట్స్, జీ ఎంటర్‌టైన్‌మెం ట్స్, మదర్సన్, ఆర్తి ఇండస్ట్రీస్ షేర్లు బాగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.56 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో 1.8 శాతం నష్టం చవిచూడగా, నిఫ్టీ మెటల్ 0.38 శాతం నష్టాలను చవి చూశాయి. కాగా, నిఫ్టీ మీడియా ఇండెక్స్ 2 శాతం మేర లాభపడ్డాయి.