16 July, 2026 | 2:22 PM

పీఎం కిసాన్ నిధుల విడుదల

19-06-2024 12:31 AM

రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు జమ

  • ప్రతి కంచంలో మన గింజ
  • ప్రపంచవ్యాప్తంగా భారత వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి కావాలి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూన్ 18: ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మంగళవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేశారు. 17వ విడతలో భాగంగా రూ.20 వేల  కోట్లను అందజేశారు. దీంతో దాదాపు 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి డైనింగ్ టేబుల్ మీద భారత్‌లో పండిన పంటతో చేసిన ఏదో ఒక ఆహారం ఉండాలని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రపంచంలో అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకమని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.3.25 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. నిధులను సరైన లబ్ధిదారులకు అందేలా టెక్నాలజీ సహకరిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు మన పంటలను ఎగుమతి చేయాలని ఆకాంక్షించారు. ఎలాంటి ప్రభావం, లోపం లేకుండా ముందుకు సాగాలని, ఈ నినాదాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.    

వారణాసికి తొలిసారి..

రైతులకు పెట్టుబడి సాయం అందించాలన్న లక్ష్యంతో 2019 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తుమన్నామని మోదీ తెలిపారు. ఏటా ఒక్కో రైతు బ్యాంక్ ఖాతాలో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేస్తున్నామన్నారు. అనంతరం ప్రధాని మోదీ 30,000 స్వయం సహాయక సంఘాల పరిధిలో శిక్షణ పొందిన ‘కృషి సఖి’ సభ్యులకు సర్టిఫికెట్లను మోదీ పంపిణీ చేశారు. ఎన్డీయే పథకాలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకే ఈ పథకం తీసుకొచ్చామన్నారు.  

లోక్‌సభ ఎన్నికల తర్వాత మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. తొలుత ఆయన దశ అశ్వమేధ ఘాట్‌లో గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించినందుకు వారణాసి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.