వాహనదారులకు ఉపశమనం
డివైడర్ తగ్గించనున్న అధికారులు
నాగోల్, ఏప్రిల్ 12 (విజయ క్రాంతి): చింతలకుంట బస్ స్టాప్ వద్ద ఉన్న డివైడర్ వెడల్పు తగ్గింపు పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ట్రాఫిక్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతం లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన డివైడర్ దాదాపు 10 నుంచి 12 అడుగుల వెడల్పుతో నిర్మించబడినట్లు తెలిపారు. అయితే, ఈ అధిక వెడల్పు కారణంగా వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని డివైడర్ వెడల్పు తగ్గించాలని అధికారులకు సూచించారు.
డివైడర్ వెడల్పు తగ్గించడం ద్వారా ట్రాఫిక్ రద్దీ కొంత మేర తగ్గడంతో పాటు, సర్వీస్ రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, డివైడర్ ఎంత మేరకు తగ్గించాలనే విషయంపై ప్రణాళిక సిద్ధం చేసి, దాని ప్రకారం పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, యువ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, ఎల్.బి.నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రవిముదిరాజ్, అరుణ్, రామకృష్ణ, తేజ తదితరులు పాల్గొన్నారు.




