ఇంటిపై దాడి కేసులో 13 మంది రిమాండ్
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో గృహప్రవేశం చేసిన ఇంటిపై దాడి చేసిన ఘటనలో 13 మంది నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు తరలించినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 27న రాత్రి 8 గంటల సమయంలో అనూప్ కుమార్ తన నివాసంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తుండగా, అంతకుముందు జరిగిన చిన్న గొడవను మనసులో పెట్టుకొని, చంపాలనే ఉద్దేశంతో దేవేందర్ నగర్ లో ఉండే 15 నుండి 20 మంది వ్యక్తులు ద్విచక్ర వాహనాల పై వచ్చి, వారి వెంట తేచుకున్న కర్రలు, హాకీ స్టిక్స్ తో అనూప్ కుమార్, వాళ్ళ కుటుంభ సభ్యుల పై దాడి చేశారు.
ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న వస్తువలను ధ్వంసం చేయడంతో పాటు బయట పార్కు చేసి ఉన్న కార్లు, బైకులను కూడా ధ్వంసం చేసి అక్కడి నుండి పారిపోయారు. ఈ ఘటనను ఇంటి ప్రక్కనే నివసిస్తున్న విలేఖరి విష్ణు గౌడ్ తన సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తుండగా ఆయనపై కూడా దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన కు కారకులైన 13 మంది పై కేసులు నమోదు చేసామని తెలిపారు.
వసురి సాయి కుమార్ (33), పులి ప్రదీప్ కుమార్(32), కేమిడి రామక్శ్రిష్ణ(23), కొమ్ము వేణు(21), ఆరుట్ల సుశాంత్ రెడ్డి(25), తాటికాయల విష్ణు(23), కుంకుడుపాముల ఉదయ కుమార్(22), మహమ్మద్ అక్తర్(25), మేడికొండ సంతోష్ కుమార్ (24), కదురు సాయి తేజ(21), అకునురి అరుణ్(20), తొండ మహేష్(32), వసురి యాకయ్య(60)లను 28న రాత్రి అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్ కు తరలించామని తెలిపారు. ఈ కేసులో పాల్గొన్న మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామని, దేవేందర్ నగర్ కాలనీ లో సంఘటనలు జరుగకుండా చూస్తామని, పెట్రోల్లింగ్ పెంచుతామని, గంజాయి మూకల చర్యలను నిరోదిస్తామని మేడిపల్లి సిఐ డి జలంధర్ రెడ్డి తెలిపారు.






