జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): న్యాయమైన డిమాండ్ల సాధన కోసం,పీఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న జర్నలిస్టులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని తెలంగాణ ఎస్సీ,ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం తెల్లవారుజామున నాగిరెడ్డిపేట్ పోలీసులు కొర్ర బన్సీలాల్,రాములు, మోహన్,శ్రీను నాయక్‌లను ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొర్ర శ్రీను నాయక్ మాట్లాడుతూ... న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ముట్టడికి వెళ్తున్న జర్నలిస్టులను హౌస్ అరెస్ట్ చేయడం,పోలీస్ స్టేషన్‌కు తరలించడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు,రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు,గృహ సౌకర్యం వంటి సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరైన విధానం కాదన్నారు.ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని,జర్నలిస్టులపై ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొన్నారు.






