27 August, 2026 | 12:19 PM

భూ వివాదం కేసు: ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

29-06-2026 10:14 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్ హనోక్ వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం, సందనవేని చందు, అతని తమ్ముడు సందనవేని రాజేశ్ మధ్య కుటుంబానికి సంబంధించిన పెరడు భూమి విషయంలో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 28న ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది.

వివాదం తీవ్రరూపం దాల్చడంతో రాజేశ్‌పై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాల కారణంగా రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో చందుతో పాటు అతని భార్య పద్మ, కుమారుడు నవనిక్షిత్ సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

సంఘటన అనంతరం పరారైన నిందితులను పోలీసులు ప్రత్యేక బృందాల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుని, నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ హనోక్ తెలిపారు.