బీఆర్ఎస్‌కు భారీ షాక్..
కాంగ్రెస్‌లో చేరిన దాభ-బి సర్పంచ్ సహా 30 మంది ముఖ్య నాయకులు
కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
గాదిగూడ,(విజయక్రాంతి): గాదిగూడ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.దాభ-బి గ్రామ సర్పంచ్ కొడప కన్ను, ఉప సర్పంచ్ జుగ్నక లింభారావు, మాజీ సర్పంచ్ సోయం మాణిక్‌రావు, అర్జుని గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కినక షేడ్మారావు, భారీక్‌రావు, పెందూర్ సుదర్శన్‌తో పాటు దాదాపు 30 మంది ముఖ్య కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం సాయంకాలం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురంభీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రతిపక్ష పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు విశ్వాసంతో వస్తున్నారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు ఉంటుందని అన్నారు.అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆమె సూచించారు.
పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజాసేవకు అంకితమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిడాం వామన్, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షురాలు పుష్పలత,మాజీ మండల అధ్యక్షుడు పరుశరాం,సర్పంచులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






