29 June, 2026 | 10:45 PM

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య

29-06-2026 10:03 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఇల్లందు బ్రాంచ్ కార్యవర్గ సభ్యుల సమావేశం బాణోత్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె. సారయ్య మాట్లాడుతూ... డిపెండెంట్ ఉద్యోగాలను కొత్త ఉద్యోగాలుగా ప్రచారం చేయడం కార్మికులను మోసం చేయడమేనని, అనారోగ్యం లేదా మరణంతో వచ్చే ఉద్యోగాలు కార్మికుల హక్కులేనని అన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని,

అసత్య ప్రచారాలతో కార్మికులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని సూచించారు. కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. 11వ వేతన ఒప్పందం జూన్ 30తో ముగుస్తున్నందున వెంటనే 12వ వేతన కమిటీని ఏర్పాటు చేయాలని, కొత్త నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 1న అన్ని గనుల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన నిర్వహించి వినతిపత్రాలు సమర్పించడంతో పాటు కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపడతామని తెలిపారు.