రోడ్డు పక్కన కట్టడాల తొలగింపు
మంథని, మే 25 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి (బేగంపేట క్రాస్ రోడ్డు)లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు శనివారం పోలీసుల సహకారంతో రోడ్డుపక్కన కట్టడాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. రోడ్డు పక్కన ఉన్న అక్రమ కట్టడాలను పొక్లెయినర్‌తో తొలగిస్తూ ఉండగా దుకాణదారులు పనులకు అడ్డుపడ్డారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కట్టడాలు ఎలా తొలగిస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. కట్టడాలు తొలగించాలని నాలుగు రోజులు క్రితం ఆదేశించామని, అయినప్పటికీ తొలగించకపోవడంతో తామే వాటిని తొలగిస్తున్నామని అధికారులు బదులిచ్చారు. అందుకు దుకాణదారులు స్పందిస్తూ ఎంతవరకు పనులు చేపడతారో కట్టడాలకు మార్కింగ్ ఇస్తే, అంతవరకు తాము తొలగిస్తామని చెప్పారు.
కట్టడాలు నిర్మించిన స్థలం ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వస్తుందని, అక్కడ రహదారి నిర్మాణానికి కొలతలతో పని లేదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే వ్యక్తులకు సంబంధించిన స్థలంలో కొలతల ప్రకారం కట్టడాలు తొలగిస్తామని సమాధానమిచ్చారు. అనంతరం పాక్షికంగా కట్టడాలను తొలగించారు. అనంతరం దుకాణదారుల విజ్ఞప్తి మేరకు తొలగింపు ప్రక్రియను నిలిపివేశారు. నిర్ణీత గడువులోగా నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. అధికారులతో దుకాణదారుల వాగ్వాదం






