10 August, 2026 | 9:31 AM

ఎమ్మెల్సీ ప్రచారానికి తెర

26-05-2024 01:23 AM

హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోలింగ్‌లో మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 2,88,189 మంది,  మహిళలు 1,75,465 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు ఐదుగురు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్‌ఎస్ నుంచి రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అభ్యర్థుల విజయం కోసం జిల్లాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.  2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున బరిలో నిలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో పట్టభద్రుల ఉపఎన్నిక అనివార్యమైంది.