అన్ని పాఠశాలల్లో మరమ్మతులు జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయాలి
- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రతిభ చూపిన జిల్లా అధికారులకు అభినందనలు
- డిప్యూటీ సీఎం, విద్యుత్, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
- గంభీరావుపేటలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం
సిరిసిల్ల, మే 5 (విజయక్రాంతి) : ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ సీఎం, విద్యుత్, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గంభీరావుపేట మండల కేంద్రంలో డిప్యూటీ సీఎం, విద్యుత్, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇంచార్జి మంత్రి వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & వస్త్ర పరిశ్రమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం శాసన వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం తో కలసి సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే పుష్ప గుచ్చం అందించి.. స్వాగతం పలికారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాలలో వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా కొరకు కీలక నిర్ణయం తీసుకుంటూ, మొత్తం రూ. 30.05 కోట్ల అంచనా వ్యయంతో ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక , ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు చేతుల మీదుగా 10 నూతన 33/11KV విద్యుత్ ఉపకేంద్రముల శంకుస్థాపన, ఒక ఉపకేంద్రం ప్రారంభోత్సవం చేశారు.
ఈ సబ్స్టేషన్ల ద్వారా సుమారు 25,785 మంది వినియోగదారులు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముఖ్యమైన కార్యక్రమమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముం దుకు వెళ్తుందని తెలిపారు. 99రోజుల కా ర్యాచరణలో భాగంగా ప్రతి ఒక్కో శాఖ ఆద్వర్యంలో వివిధ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.
ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆదేశించారు. జూన్ 15 కల్లా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మైనర్ రిపేర్లు, తాగునీరు, రన్నింగ్ వాటర్ సౌకర్యాలు పూర్తి కావాలని గడువు విధించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిధుల కొరత లేదని, పెండింగ్లో ఉన్న డైట్ ఛార్జీలను ఇప్పటికే క్రమబద్ధీకరించామని, ఇకపై ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తామన్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు. సిరిసిల్ల నేతన్నల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే రూ. 300 కోట్ల బకాయిలను విడుదల చేశామని గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలను యూనిట్కు రూ. 2 వరకు తగ్గించేలా ఎన్పీడీసీఎల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లాను అన్ని రంగాల్లో ముందు ఉంచాలి:
తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..జిల్లాను అన్ని రంగాల్లో ముందు స్థానంలో ఉంచాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రా ల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు.ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారి ని నియమించాలని తెలిపారు. కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బంది రావద్దని స్పష్టం చేశారు.
పూర్తి స్థాయిలో పరిష్కరించాలి..
మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కిందప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. చేనేత, వస్త్ర పరిశ్రమ కార్మికుల ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. వస్త్ర పరిశ్రమ కు పూర్తి మద్దతుగా ఉండాలని స్పష్టం చేశారు. భూ భారతి, సాదాబైనామా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎక్కడా సమస్య ఉండవద్దని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, అందరి సహకారంతో ముందుకు వెళ్తామని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు. సిరి సిల్ల వస్త్ర పరిశ్రమ, బీడీ పరిశ్రమ, మత్స్య పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉంచాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో ఎన్ పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.






