05-07-2025 12:24:10 AM
సీబీఐ దర్యాప్తులో మరింత మంది నిందితులు దొరికే అవకాశం
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుకూలంగా నివేదికలు ఇచ్చి ఆ కాలేజీల్లో అంతా సవ్యంగా ఉన్నట్టు చూపేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) తరఫున వచ్చే ప్రొఫెసర్లు, అధికారులను ప్రలోభపెడుతున్న వ్యవహారం వెలుగులోకి రావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అన్ని సవ్యంగా ఉన్నా అది లేదు..
ఇది లేదని కొర్రీలు పెట్టే ఎన్‌ఎంసీ.. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కనీసం రోగులు లేకపోయినా, నకిలీ రోగులతో మ్యానేజ్ చేసినా ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడి అనుమతులకు సిఫార్సు చేసిందని సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంలో వరంగల్‌కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పాత్ర ఉన్నట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. దీంతో సదరు మెడికల్ కాలేజీ చైర్మన్ కొమ్మారెడ్డి జోసఫ్‌పై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి, వాటికి అనుకూలంగా నివేదికలిచ్చేందుకు భారీగా లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలతో ఇప్పటికే 36 మందిపై కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది వైద్యులు ఈ కుంభకోణంలో ఉన్నారు. కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మెడికల్ కాలేజీ తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రావత్‌పూర్ సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు, బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. మెడికల్ కాలేజీలో తనిఖీల కోసం కొమ్మారెడ్డికి విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి రూ.50 లక్షలు అందినట్టు కూడా విచారణలో తేలింది. ఆ డబ్బును డాక్టర్ కృష్ణకిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో తరలించారని సీబీఐ దర్యాప్తులో తేలింది. ఇంకా సీబీఐ ఈ అంశంపై పెద్దఎత్తున దర్యాప్తు చేస్తుందని అనేక మంది నిందితులు చట్టానికి దొరికే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సీబీఐ దర్యాప్తులో తేలిన అంశాలు..
ఫేక్ ఫ్యాకల్టీ, బయోమెట్రిక్ మానిఫ్యులేషన్
ఎన్‌ఎంసీ దర్యాప్తు సమాచారం ముందే లీక్ చేయడంతో నకిలీ రోగులను ఏర్పాటు చేసి రోగుల సంఖ్య భారీగా ఉన్నట్టు చూపడం
సదుపాయాలు లేకపోయినా తప్పుడు నివేదికలతో పెద్దఎత్తున మెడికల్ సీట్లు సాధించడం
ఇందుకు ఎన్‌ఎంసీ అధికారులకు భారీగా లంచాలు ఇవ్వడం
విద్యార్థులకు స్టుఫైండ్స్ ఇవ్వకుండా ఇచ్చినట్టుగా తప్పుడు రిపోర్టులు తయారు చేయడం