6 April, 2026 | 10:18 PM

డీసీసీ కార్యవర్గంలో అన్ని కులాలకు అవకాశం

06-04-2026 08:56 PM

- టీపీసీసీ చీఫ్ ఆమోదంతోనే జిల్లా కమిటీ ప్రకటన

- డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తున్న, జెండా మోసిన వారికి , అన్ని కులాల వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంలో ఎంపికచేసినట్లు డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం ఆయన 73 మందితో కూడిన డీసీసీ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకొని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆమోదంతో డీసీసీ కమిటీని ప్రకటించినట్లు తెలిపారు.

డీసీసీ ఉపాధ్యక్షులుగా వేముల కృష్ణయ్య, బి. మధుసూదన్ రెడ్డి ఎన్.లక్ష్మినారాయణ, ఎం.వెంకట నర్సింహరెడ్డి, పోలేపల్లి యాదయ్య, సయ్యద్ మిన్హాజుద్దీన్, విష్ణువర్ధన్ రెడ్డి లను ఎంపిక చేసినట్లు తెలిపారు. కోశాధికారిగా జి.రాజేందర్ రెడ్డి, అధికార ప్రతినిధులుగా కంచిని లక్ష్మణ్, బాల నర్సింలు, జీడీ నారాయణలను ఎంపిక చేశామని, అదే విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులుగా 21 మంది, జిల్లా కార్యదర్శులుగా 22 మంది, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 19 మందిని ఎన్నుకోవడం జరిగిందన్నారు.

- నేడు టీపీసీసీ అధ్యక్షుడి రాక

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేడు (మంగళవారం) జిల్లాకు వస్తున్నట్లు సంజీవ్ ముదిరాజ్ వెల్లడించారు. మొదటిసారిగా ఆయన జిల్లాకు రానుండడంతో స్థానిక మెట్టుగడ్డ నుంచి ఘనంగా స్వాగతం పలుకుతామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయంలో కార్యవర్గంతో సమావేశం, ఆనంతరం షాలీమార్ పంక్షన్జర్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారని ఆయన తెలిపారు. సమావేశంలో టిపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు కంచిమి లక్ష్మణ్, గోనెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.